
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వైఎస్సార్‌సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు.
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు.
కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావటం లేదు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.
