
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ది పొందాలని కుటిల యత్నం చేస్తోందని వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల యత్నాన్ని ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కులధృవీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గం ఆందోళన చెందే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.
శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్‌లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. పైగా ఈ నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నదేనన్న మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గతంలో మెమో జారీ చేసిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం అయితే దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబరు 25 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెమోకు జీవోకు తేడా తెలియకుండా మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
జీవో జారీ చేసిందే చంద్రబాబు ప్రభుత్వం
ప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేస్తుంది. దీనిపై శెట్టిబలిజ సామాజికవర్గంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ... ఇది సాంకేతికపరమైన ఇబ్బంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల తర్వాత సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధంగా కులధృవీకరణ పత్రాలు జారీ చేసిందని చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.
తమకు నష్టం జరుగుతుందని, తమ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ... నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 19-06-1997లో జీవో నెంబరు 16 విడుదల అయింది. వాస్తవానికి 15-05-1995లో సామాజిక స్పృహ కలిగిన నాయకుడు, అందరూ సర్ధార్ అని పిలిచే గౌతు లచ్చన్న గారు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచన చేసి ఈ జీవో నెంబరు 16ను ప్రతిపాదించారు.
ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రభాకర్ రావు వంటి పెద్దలు కూడా సమ్మతి తెలిపారు. అనంతరం విడుదలైన జీవో ప్రకారం అంతా గౌడగా ఉండాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై కొంతమంది శెట్టిబలిజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించేదిగా ఉందని.. ఎప్పటిలానే శెట్టిబలిజలుగానే తమ నామకరణం ఉండాలని ప్రతిపాదించారు. ఇదే విషయంపై కోర్టులకు కూడా వెళ్లారు. దీంతో కులాల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి.. ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేశాయి. ఈ జీవోను జారీ చేసింది చంద్రబాబే
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ జీవో అమలు కాలేదు. 2014-19 వరకు మరలా చంద్రబాబు ఉన్నప్పుడూ కూడా ఈ జీవో అమలు కాలేదు. 2019-24 వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది గౌడ సోదరులు గౌతులచ్చన్న గారి ప్రతిపాదనను మరలా తెరపైకి తీసుకొచ్చారు. కేవీ సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ తో పాటు కొంతమంది కలిసి 23-02-2023 నాడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది.
మా హయాంలోనే జీవో నెంబరు 25 జారీ..
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అసమ్మతి వచ్చిందో.... ఈ మెమో జారీ చేసినప్పుడు కూడా అదే విధంగా వ్యతిరేకత వచ్చింది. కృష్ణా జిల్లాలో శెట్టిబలిజ కులస్తులు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే గౌడ అని వస్తుందని అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు 10-11-2023 నాడు రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నా వారికి కేవలం శెట్టిబలిజ అని మాత్రమే ఇవ్వాలని జీవో ఎం ఎస్ నెంబరు 25 జారీ చేశాం. అదే సమయంలో రాయలసీమలో ఉన్న శెట్టిబలిజలుది గీత వృత్తి కాకపోవడంతో గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు కూడా వర్తించదని జీవోలో పొందుపరిచాం.
మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వం
కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కారణమో లేక ఇతర కారణాల వల్ల గతంలో ఎవ్వరూ అమలు చేయని నిర్ణయాన్ని కేవలం ఒక మెమోని మాత్రమే ఆధారంగా చేసుకుని గౌడ అని ముందు చేర్చి తర్వాత శెట్టిబలిజ, ఈడిగ, యాత అని చేర్చడం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ శెట్టిబలిజల్లో ఆందోళనకు కారణమైంది. ధృవీకరణ పత్రాలు జారీ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. తమ తప్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించకుండానే.. ప్రజలకేం చెప్పినా నమ్ముతారన్న అతి విశ్వాసంతో ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు.
మెమోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడ్డం హాస్యాస్పదం. ప్రజలు వారి వారి కులాల పేర్ల మీదే కులధృవీకరణ పత్రాలు మంజారు చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా, జీవో నెంబరు 6 జారీ చేయడం ద్వారా వారి అశాంతికి కారణం అయింది. గౌత లచ్చన్న గారి ఆశయానికి కూడా కూటమి ప్రభుత్వం చరమ గీతం పాడింది. మాస్టర్ కేస్ట్ సర్టిఫికేట్ పేరుతో మా ప్రభుత్వం గౌడ, శెట్టిబలిజ, యాత కులాలను కలిపి ఉంచామని ఒకవైపు చెబుతారు, మరోవైపు వైఎస్ జగన్ వచ్చి అందరికీ విడిగా కార్పొరేషన్లు ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి. వారికి ఒక వేదిక ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 672 మందిని డైరెక్టర్లుగా నియమించాం. ఇవాళ ఏడాదిన్నర కావస్తున్నా కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను భర్తీ చేయలేదు.
బీసీలకు అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే
బీసీలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలుంటే వాటిని ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా అందేటట్టు చేసిన ఘనత దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్‌లకే చెందుతుంది. మార్కెటింగ్ కమిటీల్లోనూ, దేవాలయాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ కాదా?, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీల, ఎస్టీలు, మైనార్టీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. బీసీలకు మేలు చేశామని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వారికి ఒక మగ్గమో, మోకూ, చక్రమో ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప వారి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పనిచేయలేదు.
కేవలం వారిని గౌరవిస్తున్నట్టు నటిస్తూ.. వారి ఆశయాలను నశింపజేసే ప్రక్రియ కూటమి పాలనలో జరుగుతుంది. కులాల మధ్య ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని తక్షణమే పరిష్కరించాం. కానీ అవగాహన లేని మంత్రి మాత్రం ఫేక్ జీవో అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం. ఆయన మెమోకి జీవోకి తేడా తెలుసుకోవాలి. కేవలం కులాల నడుమ ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఈ వివాదం. ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి