
కక్ష కట్టి.. కడతేర్చి..
నల్లజర్ల: భార్యను కాపురానికి పంపడం లేదని అత్తమామలపై కక్ష కట్టిన అల్లుడు.. చాకుతో వారిద్దరినీ దారుణంగా పొడిచి చంపాడు. మండలంలోని ఘంటావారిగూడెంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పూళ్ల గ్రామానికి చెందిన ఏకుల బాబూరావు కొన్నేళ్ల కిందట ఘంటావారిగూడేనికి మకాం వచ్చాడు. ఆయనకు భార్య శారద, కుమారుడు అప్పారావు, కుమార్తె నాగేశ్వరి ఉన్నారు. అప్పారావు ఉద్యోగ రీత్యా విశాఖపట్న ంలో ఉంటున్నాడు. దెందులూరు మండలం గంగన్నగూడేనికి చెందిన మరీదు కోటేశ్వరరావుతో నాగేశ్వరికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బాబూరావు, శారద ఘంటావారిగూడెంలో ప్రధాన రహదారి పక్క చిన్న టీ హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. భర్త వేధింపులు భరించలేక ఏడాది క్రితం నాగేశ్వరి తన ఇద్దరు కుమారులు గిరిష్, లోకేష్‌లతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. పిల్లలిద్దరినీ స్థానికంగా ఉన్న పాఠశాలలో చదివించుకుంటోంది.
తరచూ గొడవలు
కోటేశ్వరరావు తరచూ ఘంటావారిగూడెం వచ్చి భార్యను కాపురానికి పంపాలని అత్తమామలపై ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. ఈ గొడవపై రెండు, మూడుసార్లు పెద్దల సమక్షంలో తగవులు జరిగాయి. అయితే మద్యం తాగి వచ్చి విపరీతంగా కొట్టే భర్త దగ్గరకు కాపురానికి వెళ్లడానికి నాగేశ్వరి నిరాకరించింది. నెల రోజుల క్రితం కోటేశ్వరరావు ఘంటావారిగూడెం వచ్చి బాబూరావుతో ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో మామ పీక నులుముతుండగా స్థానికులు వచ్చి విడదీశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ పని ముగించుకొని బాబూరావు, శారద, నాగేశ్వరి ఇంటికి వచ్చారు. అదే సమయంలో కోటేశ్వరరావు బైక్‌పై వచ్చి ఆ వీధిలో రెండుసార్లు రౌండ్లు కొట్టాడు. అనంతరం ఇంటి వద్ద ఆగి, మొక్కలను శుభ్రం చేస్తున్న అత్త శారద(48)ను చాకుతో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వస్తున్న మామ బాబూరావు(58)ను హతమార్చాడు. ఇది చూసిన నాగేశ్వరి ఇంట్లోకి వెళ్లి దాక్కుని ప్రాణాలు కాపాడుకుంది. అనంతరం కొటేశ్వరరావు బయటకు వస్తూ.. కొంచెం కదులుతున్న శారదను మరోసారి పొడిచాడు. చాకును సంఘటన స్థలంలోనే పాడేసి, తీరుగ్గా సిగరెట్ కాల్చుకుంటూ తన తల్లికి ఫోన్ చేశాడు. అత్తమామలు ఇద్దరినీ చంపేసాను, జైల్లో ఉంటానని చెప్పాడు. పోలీసులు వచ్చే వరకు అతడు అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న సీఐ బాలశౌరి తమ సిబ్బందితో వచ్చి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే డీఎస్పీ దేవకుమార్ మాత్రం నిందితుడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, కేసు నమోదు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అత్తమామలను హత్య చేసిన అల్లుడు
భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహం
ఘంటావారిగూడెంలో కలకలం

కక్ష కట్టి.. కడతేర్చి..

కక్ష కట్టి.. కడతేర్చి..

కక్ష కట్టి.. కడతేర్చి..

కక్ష కట్టి.. కడతేర్చి..