సమయానికి రాని 108
స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు
జగ్గంపేట బస్టాండ్‌లో ఘటన
జగ్గంపేట: బంధువును బస్సు ఎక్కించడానికి వచ్చిన మహిళ ప్రమాదం బారిన పడింది. బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవి. గోకవరం గ్రామానికి చెందిన రేవాడి రాజేశ్వరి (29) ఇంటికి ఆమె అక్క కుమార్తె అశ్విని తన చంటి పిల్లతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. తిరిగి తన సొంత ఊరు తుని వెళ్లడానికి బుధవారం సిద్ధమైంది. అయితే అశ్వినిని జగ్గంపేటలో బస్సు ఎక్కించటానికి రాజేశ్వరి కూడా ప్రయాణమైంది.
జగ్గంపేట బస్టాండ్‌లో తుని వెళ్లడానికి రాజమహేంద్రవరం నుంచి వచ్చిన బస్సులో అశ్వినిని ఎక్కించి, లగేజీ సర్దిపెట్టింది. ఆ సమయంలో బస్సు కదలడంతో దిగిపోయే ప్రయత్నంలో బస్సు నుంచి కిందకు పడిపోయింది. దీంతో బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో రాజేశ్వరి కుడి కాలు నుజ్జునుజ్జయ్యింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమెను దగ్గరకు ఎవ్వరూ రాలేదు. స్థానిక శెట్టిబలిజిపేటకు చెందిన శివభక్తుడు పాలిక అప్పారావు ఆమెకు అండగా నిలిచాడు. అలాగే ప్రమాదాన్ని చూసిన అశ్విని వెంటనే బస్సు దిగిపోయింది.
ఎంతకీ రాని అంబులెన్స్
తీవ్రగాయాలతో రోదిస్తున్న రాజేశ్వరిని చూసి బస్టాండ్‌లో ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. కానీ ఎంత సేపటికీ అంబులెన్స్ రాలేదు. దీంతో సుమారు 45 నిమిషాల తర్వాత ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి స్ట్రెచర్ తీసుకువచ్చి చికిత్స కోసం తీసుకువెళ్లసాగారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ వ్యాన్‌లో రాజేశ్వరిని ఎక్కించి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రాజమహేంద్రవరానికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో బాధితురాలి కుటుంబ సభ్యులను ఏలేశ్వరం ఆర్టీసీ డీఎం జీవీ సత్యనారాయణ కలిసి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు అందిన తరువాత కేసు నమోదు చేస్తామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు.

స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలింపు