
విద్యుత్ స్మార్ట్ మీటర్ దగ్ధం
నిడదవోలు: స్థానిక గాంధీబొమ్మ సెంటర్‌లో ఉన్న న్యూ మంజునాథ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీలోని విద్యుత్ స్మార్ట్ మీటర్ బుధవారం దగ్ధమైంది. బేకరి యజమానికి ఇష్టం లేకపోయినా విద్యుత్ సిబ్బంది వచ్చి రెండు నెలల క్రితం ఈ మీటర్‌ను బిగించారు. అయితే నాసిరకం మీటర్ ఏర్పాటు చేయడంతో ఈ విధంగా జరిగిందని బాధితుడు చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చిట్టీల సొమ్ము
రూ.2 కోట్లతో వ్యక్తి పరార్
తాళ్లపూడి: చిట్టీల సొమ్ము రూ.2 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన సంఘటన తిరుగుడుమెట్టలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో కిరాణా వ్యాపారం చేసే బెల్లంకొండ సత్యనారాయణ చిట్టీలు వేస్తుంటాడు. అతడి వద్ద గ్రామస్తులు చాలామంది చిట్టీలు కట్టారు. అయితే భార్యతో కలసి సత్యనారాయణ గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు బుధవారం అతడి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ సత్యనారాయణ కొన్నేళ్లుగా చిట్టీలు కట్టించుకుంటున్నాడని, అతడి వద్ద పెద్ద మొత్తంలో వాటిని వేసినట్టు తెలిపారు. చిట్టీ పాట సొమ్మును కూడా తన వద్దే ఉంచుకుని, వడ్డీ ఇస్తానని నమ్మించేవాడన్నారు. అలాగే చాలామంది అతడికి అప్పులు కూడా ఇచ్చామన్నారు. ఇలా సుమారు రూ. 2 కోట్ల వరకూ వసూలు చేశాడన్నారు. కాగా.. బాకీల వాళ్లు వేధిస్తున్నారని, ఆ భయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నట్టు సత్యనారాయణ ఉత్తరం రాసి ఉంచినట్టు సమాచారం. అతడి ఇద్దరు కుమారుల్లో ఒకరు లండన్, మరొకరు హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారని చెబుతున్నారు.

విద్యుత్ స్మార్ట్ మీటర్ దగ్ధం