
సీతారామ సత్రాన్ని కూల్చివేయండి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానంలో శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని కూల్చివేయాలని జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు బృందం స్పష్టం చేసింది. ఆ సత్రానికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని తెలిపింది. ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నంతో కూడిన బృందం ఈ నెల 13వ తేదీన సీతారామ సత్రం లోని గదులు, శ్లాబ్, గోడలను పరిశీలించింది. అనంతరం తమ నివేదికను బుధవారం దేవస్థానానికి అందజేసింది. కాగా.. ఆర్‌బీఐ అధికారుల నివేదికను అనుసరించి ఈ సత్రాన్ని కూల్చివేయాలని గతంలోనే నిర్ణయించారు. 2024 మేలో దీన్ని కూల్చివేసి, నూతన సత్రం నిర్మించేందుకు రూ.11.40 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా 16 శాతం తక్కువకు ఖరారు చేశారు. అదే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని పరిశీలించిన దేవదాయశాఖ సలహాదారు కొండలరావు దీనికి మరమ్మత్తులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేయడంపై గందరగోళం నెలకొంది. దీంతో ఈ సత్రం మరమ్మత్తులు చేయడానికి సుమారు రూ. రెండు కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనిపై జూన్ 26న సాక్షి పత్రికలో ‘సత్యదేవ చూడవయ్యా’ శీర్షికన వార్త ప్రచురితమైంది. ఆ వార్తపై కలెక్టర్ షణ్మోహన్, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ స్పందించారు. ఈ సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్‌టీయూ ప్రొఫెసర్లను కోరారు.
నివేదిక ఇచ్చిన జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు
‘సాక్షి’ కథనానికి స్పందన

సీతారామ సత్రాన్ని కూల్చివేయండి