
సర్కారు ఆదేశాలకు కూటమి నేతల తూట్లు
● అనుమతి లేని చోట
ఏకంగా ప్రారంభోత్సవం
● ఎమ్మెల్యే సతీమణి తీరుపై విమర్శలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘ప్రభుత్వ పాఠశాలలో అనధికార వ్యక్తులకు అనుమతి లేదు, విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల నిర్వహణా కమిటీ సభ్యులకు మాత్రమే ప్రవేశం’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు జారీ చేసిన ఆదేశాలకు విలువ లేకుండా పోయింది. జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న సీతానగరం మండలం, మునికూడలిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే సతీమణి ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయవలసిన వారే వాటిని తుంగలోకి తొక్కేసి, అనధికార వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలిలావున్నాయి. మునికూడలిలో పాఠశాల భవన ప్రారంభోత్సవం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా సోమవారం జరుగవలసి ఉంది. కానీ ఆయన భార్య వెంకటలక్ష్మితో ప్రారంభోత్సవం చేయించడంతోపాటు, బడి పిల్లలతో ఆమె పూలు చల్లించుకోవడం విడ్డూరమని స్థానికులు విమర్శిస్తున్నారు. శిలాఫలకంపై ఆమె పేరును కూడా చెక్కడం ఆశ్చర్యకరం. రుడా చైర్మన్ హోదాలో హాజరైన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణచౌదరిని ఉత్సవ విగ్రహం చేశారు. కూటమి ప్రభుత్వంలో జీవోలకుఎంతటి విలువనిస్తున్నారో ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నీరుకొండ వీరన్నచౌదరి కూడా అనధికార వ్యక్తిగా పాల్గొన్నారు.

సర్కారు ఆదేశాలకు కూటమి నేతల తూట్లు