
ఏదోమంత్రం చాలదు
● పల్లెలు, పట్టణాల్లో విపరీతమైన దోమల సమస్య
● నిత్యం రోగాల పాలవుతున్న జనం
● ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వ్యాధిగ్రస్తులు
● నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగం
అరకొర చర్యలు
● పటిష్ట పారిశుధ్య చర్యలతోనే నివారణ సాధ్యం
● రేపు ప్రపంచ దోమల దినోత్సవం
ఆలమూరు: దోమ సైజు చిన్నదే కానీ.. కుట్టిందంటే మాత్రం పెద్ద ప్రమాదమే. అసలే వర్షాకాలం.. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో దోమలూ విజృంభిస్తున్నాయి. వీటి ద్వారా కలిగే వ్యాధులకు సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకం కావచ్చు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు.. సరైన పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో దోమల వ్యాప్తి సమస్యాత్మకంగా మారింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా, చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అంటు వ్యాధులు ప్రబలుతున్నా యి.
దోమకాటుతో మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్‌కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత సర్ రోనాల్డ్ రాస్ 18 ఏళ్ల పాటు దోమల వల్ల సంక్రమించే వ్యాధులపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా సంభవిస్తుందనే విషయాన్ని 1897 ఆగస్టు 20న కనుగొన్నారు. డబ్ల్యూహెచ్‌ఓ సూచనల మేరకు ఆ రోజును ప్రపంచ దోమల దినోత్సవం (వరల్డ్ మస్కిటో డే) జరుపుతున్నారు.
నిర్మూలన చర్యలు తప్పనిసరి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏడు సామాజిక, రెండు ఏరియా అస్పత్రులున్నాయి. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీల ద్వారా దోమల నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ విసృత ప్రచారం నిర్వహిస్తోంది. వర్షాకాలంలో తేమ శాతం అధికంగా ఉన్న ప్రదేశాల్లో దోమల వ్యాప్తి అధికంగా ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిత్యం పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దోమల నివారణకు దోమ తెరలు వాడటం, సంపూర్ణ పారిశుధ్య చర్యలు పాటించాలి. జనావాసాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైనేజీల్లో లార్వాసైడ్ క్రిమి సంహారక మందును పిచికారీ చేయాలి. ఇంటి గోడలపై సింథటిక్ ఫైరిత్రాయిడ్, ఏసీఎం క్రిమి సంహారక మందును చల్లాలి.
మలేరియా లక్షణాలు
● అంటువ్యాధి మలేరియాను రక్త పరీక్ష (ఆర్‌డీ) ద్వారా నిర్థారించవచ్చు.
● ప్లాస్మోడియం జాతికి చెందిన అనాఫిలిస్ దోమ వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
● వ్యాధిగ్రస్తుడు చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడతాడు.
● వ్యాధి నిరోధక శక్తి లేనివారు విపరీతమైన తలనొప్పితో ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదముంది.
● దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
● గిరిజన ప్రాంతాల్లో ఫాల్సిపారం మలేరియా అధికంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లో వైవాక్స్ జాతి మలేరియా విస్తృతంగా వ్యాపిస్తుంది.
డెంగీ నిర్థారణ–లక్షణాలు
● ఏడిస్ ఈజిప్టి దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
● రక్త ప్రవాహంలో గడ్డ కట్టే రక్త కణాల సంఖ్య భారీగా క్షీణిస్తాయి.
● డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్‌ఐవీ) పరీక్ష ద్వారా నిర్థారిస్తారు.
● వ్యాధిగ్రస్తుని అవయవాలపై ఏ మేరకు ప్రభావం ఉందో గుర్తించేందుకు పూర్తి రక్త గణన, ఈ ఎకోకార్డియోగ్రఫీ, సెరోలజీ పరీక్ష, యాంటీజెన్ డిటెక్షన్, రేడియాలజీ ఇమేజింగ్, ఫైబ్రిన్ క్షీణత ఉత్పత్తి రక్త పరీక్షలు నిర్వహిస్తారు.
● జ్వరం తరచూ వస్తుంటే వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స పొందాలి.
● డెంగీ జ్వరం సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో దోమకాటు వల్ల్ల సోకుతుంది.
చికున్‌గున్యా నివారణ
● ఏడిస్ అల్పోపిక్టస్ జాతి దోమకాటు వల్ల చికున్‌గున్యా వస్తుంది.
● వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం ద్వారా వ్యాప్తిస్తుంది.
● వ్యాధి సోకిన వారికి 102 డిగ్రీలు పైబడి జ్వరం వస్తుంది.
● కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
● సాధారణంగా వారం నుంచి 12 రోజుల్లోపు లక్షణాలు కనిపిస్తాయి.
● వ్యాధిగ్రస్తుడు త్వరితంగా అలసట చెందుతారు.
● ఒకొక్కరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది.
● గర్భిణులు ప్రసవ సమయంలో చికున్‌గున్యా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ
వర్షాకాలం దృష్ట్యా విజృంభిస్తున్న దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాం. వైద్యారోగ్య సిబ్బంది ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి, పారిశుధ్య నిర్వహణ, దోమల నియంత్రణను ప్రజలకు వివరిస్తున్నారు. అంటువ్యాధుల నివారణకు క్షేత్ర స్థాయిలో హెల్త్ అసిస్టెంట్లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
– ఎన్.వెంకటేశ్వరరావు,
జిల్లా మలేరియా యూనిట్ అధికారి, అమలాపురం
జికా వైరస్ వ్యాప్తి
ఏడిస్ ఈజిప్టి దోమకాటు వల్ల జికా వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది.
వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం జరిపిన వారికీ వ్యాప్తిస్తుంది.
దేశంలో ఈ వైరస్ ప్రభావం అంతగా లేదు,
వైరస్ సోకినా సాధారణ జ్వరం వస్తుంది.
చికున్‌గున్యా, డెంగీ వైరస్‌ల ద్వారానే జికా వ్యాప్తి చెందుతుంది.
వైరస్ సోకిన వ్యక్తులకు దృష్టి సమస్యలు రావచ్చు.
జ్వరం లక్షణాలుంటే వైద్యుల్ని సంప్రదించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు.

ఏదోమంత్రం చాలదు

ఏదోమంత్రం చాలదు

ఏదోమంత్రం చాలదు

ఏదోమంత్రం చాలదు