
ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం
తండ్రి మందలించాడని ఘాతుకం
రాయవరం: సరిగ్గా చదవడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు సోమ వారం కేసు నమోదు చేశారు. రాయవరం మండలం పసలపూడి శివారు సర్వారాయ తోటలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దంగేటి వెంకటరమణ(19) బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై డి.సురేష్‌బాబు వివరాల మేరకు, తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వెంకటరమణ సర్వారాయతోటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ, రామచంద్రపురంలోని వీఎస్‌ఎం కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తల్లిదండ్రుల వద్దకు పటవల గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో కుమారుడి చదువు గురించి తండ్రి ఆరా తీసినట్టు తెలిసింది. ఫస్టియర్ సబ్జెక్టులు ఉండిపోయిన విషయాన్ని తెలుసుకుని అతడిని తండ్రి మందలించడంతో.. మనస్తాపానికి గురైన వెంకటరమణ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.