
‘రిజిస్టర్డ్ టపా’కు టాటా
● వచ్చే నెల ఒకటి నుంచి రద్దు
● స్పీడ్ పోస్ట్‌లో విలీనం
● ఇక ట్రాకింగ్ సిస్టమ్‌తో విస్తృత సేవలు
అమలాపురం టౌన్: దశాబ్దాలుగా పోస్టల్ శాఖలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ పోస్టు రద్దవుతోంది. ఈ నెలాఖరుకు రిజిస్టర్డ్ పోస్టు అనేది పోస్టల్ శాఖ నుంచి అంతర్థానం కానుంది. రిజిస్టర్డ్ పోస్టును స్పీడ్ పోస్ట్‌లో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ అమలులోకి తీసుకురానుంది. ఇక నుంచి స్పీడ్ పోస్ట్‌లే పార్సిల్ సేవలు అందించనున్నాయి. స్పీడ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖలో కొన్నేళ్ల కిందట నుంచి విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్ పోస్ట్‌లో ట్రాక్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పార్శిల్ బుక్ చేసిన వ్యక్తికే కాకుండా, దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్‌కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్ వస్తుంది. బుక్ చేసిన పార్శిల్ ఎక్కడుంది, ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్ ఫోన్లలో చూసుకునే వెసులుబాటు కల్పించింది.
సరికొత్త టెక్నాలజీ దిశగా..
పోస్టల్ శాఖ ఇప్పటివరకు అమలవుతున్న టెక్నాలజీ విధానాలకు స్వస్తి పలికి, సరికొత్త సాంకేతిక, ఆధునీకతతో కూడిన ఏపీటీ 2.0 ద్వారా సేవలు అందిస్తోంది. జూలై నెలకు ముందు పోస్టల్ శాఖ మొత్తం సేవలు కోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అందేవి. వీటి స్థానే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఉన్న ఏపీటీ 2.0 అమలులోకి తెచ్చింది. అమలాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆర్.నవీన్‌కుమార్ డివిజన్‌లో పోస్టల్ సేవలను ఏపీటీ 2.0 ద్వారా సేవలు అందించడమే కాదు.. వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విలీనమైన స్పీడ్ పోస్ట్ ద్వారా సాంకేతిక సౌకర్యాలతో సేవలందించేందుకు డివిజన్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలో రెండు ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, 39 సబ్ పోస్టాఫీసులు, 196 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో స్పీడ్ పోస్ట్ ఆధునిక సాంకేతిక సేవలు అందబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా పోస్టల్ కార్యాలయాల ద్వారా గత జూలై నుంచి ఏపీటీ 2.0 ద్వారా మొత్తం పోస్టల్ సేవలను అందుతున్నాయి.