
దూసుకొచ్చిన మృత్యువు
● కోరంగిలో ఇద్దరిని బలిగొన్న అతివేగం
● పాదచారి, ఆటోను ఢీకొన్న కారు
● మరో మహిళకు గాయాలు
తాళ్లరేవు: మృత్యు రూపంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం కోరంగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ పనికి వెళ్లి, ఇంటికి తిరిగి వెళుతున్న పాదచారితో పాటు, చర్చిలో ప్రార్థనలను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ దుర్మరణం పాలయ్యారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి 216లోని కోరంగి పెంతెకోస్తు చర్చి వద్ద ఆగి ఉన్న ఆటోను యానాం నుంచి కాకినాడకు వెళుతున్న కారు వేగంగా వచ్చి.. తొలుత పాదచారిని, తర్వాత ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో కొత్త కోరంగి గ్రామానికి చెందిన నిమ్మితి ఏసు(50) అక్కడికక్కడే మృతి చెందగా, ఆగి ఉన్న ఆటోలో కూర్చున్న పాత కోరంగి గ్రామానికి చెందిన అరుబరుగుల లక్ష్మి(58) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో మహిళ దడాల ధనలక్ష్మికి గాయాలు కాగా, స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
చిన్నారులు సురక్షితం : ఇలాఉండగా ఆటోలో ఉన్న మరో నలుగురు చిన్నారులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మృతుడు ఏసు భార్య హైదరాబాద్‌లో ఉండగా, వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే పాత కోరంగి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన హెల్పర్‌గా పని చేస్తున్న లక్ష్మి భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె తన ఇద్దరు కుమారుల వద్ద ఉంటోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వివరాలు సేకరించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా సంఘటన సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. కారులో కొన్ని మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో వారు మద్యం సేవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఉన్నవారిలో ఇద్దరు పరారు కాగా, ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది.

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు