
ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా ఆర్చరీ పోటీలు
పిఠాపురం: జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు స్థానిక ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఇండియన్ రౌండ్ ఆర్చరీ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, కాకినాడ, తుని, పిఠాపురం నుంచి సుమారు 60 మంది ఇండియన్ రౌండ్ ఆర్చర్లు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. పిఠాపురం క్రీడాకారులు ఓవరాల్ తొలి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో కాకినాడ, మూడో స్థానంలో అమలాపురం ఆర్చర్లు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ పోటీలు ప్రారంభించి, క్రీడాకారులకు పతకాలు అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా బాక్సింగ్ సంఘ అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్, పలువురు నాయకులు బహుమతీ ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలుగా పి.కృష్ణ, కె.చిన్నబ్బాయి, ఎం.గణేష్, జె.ప్రసాదరావు వ్యవహరించారు. డీఎస్‌డీవో బి.శ్రీనివాస్ కుమార్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణ, పి.లక్ష్మణరావు, ఏపీ ఒలింపిక్ సంఘ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం, జిల్లా ఆర్య వైశ్య సంఘ కన్వీనర్ బోడ సతీష్ పాల్గొన్నారు.