
కూలీలపై అడవి పంది దాడి
నలుగురికి గాయాలు
ఐ.పోలవరం: గ్రామ పరిధిలో వరి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న నలుగురు కూలీలపై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన నలుగురినీ టి.కొత్తపల్లి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వారి బంధువులు తెలిపారు. గాయపడిన వారిని దంగుడుబియ్యం రాజారావు, గుత్తుల త్రివేణి పద్మావతి, బొలిశెట్టి రాంబాబు, దంగేటి వెంకటరెడ్డిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన అధికారులు.. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఇలాఉండగా పలువురు గ్రామస్తులు శ్రమించి అడవి పందిని బంధించారు. సాధారణంగా ఈ ప్రాంతంలో అడవి పందుల సంచారం చాలా తక్కువ. సమీపంలో ఉన్న మడ అడవుల నుంచి అడవి పంది ఇక్కడకు చేరుకున్నట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో తీర ప్రాంతంలోని సరుగుడు తోటల్లో వీటి ఉనికిని గుర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు.
ముగిసిన సీబీఎస్‌ఈ
యోగా పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ): సౌత్ జోన్ సీబీఎస్‌ఈ యోగా పోటీలు స్థానిక లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆదివారం ముగిశాయి. ఏపీ, తెలంగాణతో పాటు, తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంప్రదాయ యోగా, ఆర్టిస్టిక్, రిథమిక్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు స్కూల్ డైరెక్టర్ సుగుణారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వందనబొహ్రా, యోగా ట్రైనర్ సీహెచ్ సుధ పాల్గొన్నారు.

కూలీలపై అడవి పంది దాడి