
హైవేపై ఆయిల్ మాఫియా
● లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా
డీజిల్ కొనుగోలు
● లాభం వేసుకుని ఇతర లారీలకు విక్రయం
● అక్రమార్కుల ధనార్జన
గండేపల్లి: స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆయిల్ మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆయిల్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. పలు జిల్లాలు, రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఈ జాతీయ రహదారిపై పలు శాఖల చెందిన అధికారులు ప్రయాణిస్తుంటారు. అయినప్పటికీ అక్రమార్కులు యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చైన్నె, విజయవాడ, కోల్‌కతా, విశాఖపట్నం తదితర నగరాలకు ఎగుమతులు, దిగుమతుల కోసం నిత్యం వందల లారీలు హైవేపై ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో లారీ యజమానులు లారీలకు ఆయిల్‌ను ఫుల్ ట్యాంక్ చేయించి సరకు ఎగుమతులు, దిగుమతుల కోసం గమ్యస్థానాలకు పంపుతారు. ఒక్కొక్కసారి డ్రైవర్లే ఆయిల్‌ను ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు. అయితే గమ్యస్థానాలకు వెళుతుండగా మధ్యలో లారీ డ్రైవర్, క్లీనర్ ఒక్కటై.. ట్యాంక్‌లో డీజిల్‌ను అక్రమంగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
యథేచ్ఛగా వ్యాపారం
మల్లేపల్లిలో ఈ డీజిల్ అక్రమ వ్యాపారం కొంత కాలంగా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది. లారీ డ్రైవర్, క్లీనర్ల నుంచి డీజిల్‌ను కొందరు వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద ఒక లీటర్ డీజిల్‌ను రూ.96.74కి విక్రయిస్తుండగా, ఆయిల్ మాఫియా నిర్వాహకులు.. లారీల వద్ద రూ.75కు కొనుగోలు చేస్తున్నారు. ఆ డీజిల్‌ను ఇతర లారీలకు రూ.85కి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాబా, టీ షాపుల వద్ద డ్రైవర్లు టీ తాగేందుకు, టిఫిన్, భోజనం నిమిత్తం ఆగుతుండటంతో ఆ ప్రాంతంలోనే ఈ వ్యాపారం కొనసాగుతోంది. కొన్నిసార్లు రహదారిపైనే వాహనాలను నిలిపి ఆయిల్‌ను బయటకు తీసే సమయంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అక్రమంగా డీజిల్ విక్రయించిన లారీ డ్రైవర్లకు కొందరు వ్యాపారులు డబ్బులకు బదులు మద్యం సీసాలను ఇస్తున్నట్టు సమాచారం.

హైవేపై ఆయిల్ మాఫియా