
భక్తవత్సలా గోవిందా
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు
● ఒక్కరోజే రూ.60 లక్షల ఆదాయం
కొత్తపేట: భక్తవత్సలా గోవిందా.. భాగవతాప్రియ గోవిందా అంటూ ఆ శ్రీనివాసుడిని స్మరిస్తూ భక్తజనం మురిసింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరారు. అనేక మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నసమారాధన జరిపారు. భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్‌లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం ద్వారా దేవస్థానానికి ఒక్కరోజే రూ.60,17,243 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, ఆలయ ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. కాగా.. ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన బాలికల శాసీ్త్రయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. న్యూఢిల్లీ ఫౌండేషన్ ఫోర్ డెవలప్ ఇండియా కళాశాలకు చెందిన కళాకారులు కూచిపూడి నృత్యం చేశారు.

భక్తవత్సలా గోవిందా