
ప్రాణప్రదాతలూ స్పందించండి..
● సికిల్ సెల్ వ్యాధితో బాలిక అవస్థలు
● వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు
● సాయం కోరుతున్న తల్లిదండ్రులు
కపిలేశ్వరపురం (మండపేట): ఆడుతూ పాడుతూ తిరగాల్సిన సమయంలో ఆ పాప మంచాన పడింది. తోటి స్నేహితులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో జ్వరం, నీరసం, ఒళ్లనొప్పులతో బాధపడుతోంది. ఆ బాలిక వైద్య చికిత్సకు సాయం చేయాలని దాతలను తల్లిదండ్రులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండపేట పట్టణంలోని 26వ వార్డు గాంధీ నగర్ కోలావారి తోట ప్రాంతానికి చెందిన నీలాపు అమృత వర్షిణి సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతోంది. ఆమె తండ్రి ఈశ్వరరావు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు. తల్లి అనూరాధ గృహణి. అమృత వర్షిణి నాలుగో తరగతి, కుమారుడు రామ్‌తేజ్ దామోదర కుమార్ ఏడో తరగతి చదువుతున్నారు. 2016 సెప్టెంబర్‌లో పుట్టిన కుమార్తె అమృత వర్షిణి సుమారు నాలుగేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఆరో సంవత్సరం ప్రారంభంలో ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ఈ సమస్య ప్రారంభమైంది. మొదట్లో మండపేట, రాజమహేంద్రవరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించారు. అనంతరం వైజాగ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా సికిల్ సెల్ ఎనీమియాగా నిర్ధారించారు. దీంతో 2022లో తమిళనాడు వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారీ వైద్యానికి సుమారు రూ.20 వేలు ఖర్చవుతోంది. ఆరు నెలలకు ఒక్క సారి రక్తం ఎక్కించాల్సి వస్తోంది. దాతలు సమకూరనప్పుడు తండ్రి ఈశ్వరరావు తన రక్తాన్ని దానం చేసి ప్రత్యామ్నాయంగా పాప గ్రూపునకు చెందిన రక్తాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈశ్వరరావు మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్‌గా నమోదు కావడంతో కుటుంబానికి ప్రభుత్వ సాయం అందడం లేదు. దీంతో బాలిక చికిత్సకు దాతలు సహకారం అందించాలని కోరుతున్నారు. వివరాలకు 80087 88195 నంబర్‌ను సంప్రదించవచ్చు.