
రత్నగిరి.. భక్తజన ఝరి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది భక్తులు
● స్వామివారి వ్రతాలు మూడు వేలు
● ఆదాయం రూ.40 లక్షలు
● మంచినీరు లేక క్యూలో అల్లాడిన భక్తులు
అన్నవరం: శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని ఆలయం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసింది. సత్యదేవుని దర్శించేందుకు భక్తులు స్వామివారి ఆలయానికి భారీగా తరలివచ్చారు. దీనికితోడు రత్నగిరిపై, పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు కూడా జరుగుతుండడంతో.. పెళ్లి బృందాలు, నవ దంపతులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులతో పాటు, హాజరైన పెళ్లి బృందాలు, ఇతర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న నవ దంపతులు భారీగా రత్నగిరికి తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయం, వ్రత మంటపాలు, క్యూ లైన్లు, విశ్రాంతి మంటపాలన్నీ నవ దంపతులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా ఉదయం 12 గంటల వరకు అంతరాలయ దర్శనం నిలిపివేశారు. వ్రతాల నిర్వహణ కోసం కూడా భక్తులు వ్రత మంటపాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించినట్టు దేవస్థాన వర్గాలు తెలిపాయి. స్వామివారి వ్రతాలు మూడు వేలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు.
భక్తులకు అందని మంచినీరు
కాగా, శుక్రవారం రత్నగిరికి విచ్చేసిన భక్తులు క్యూ లైన్లలో మంచినీరు అందక అల్లాడిపోయారు. ఆలయం దిగువన క్యూలైన్లు ప్రారంభమయ్యే లిఫ్ట్ వద్ద, ఆలయం వద్ద ఉన్న క్యూ లైన్లలో సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లు భక్తులకు మంచినీరు అందించేవారు. కానీ శుక్రవారం వారెవరూ కనిపించలేదు. ఆలయం వద్ద క్యూలైన్లలో ఖాళీ మంచినీటి పాత్రలు దర్శనమిచ్చాయి.

రత్నగిరి.. భక్తజన ఝరి