విజయం విద్యార్థులది.. ప్రచారం నాయకులది..!
వివాదాస్పదంగా మాధ్యమాల పోస్టింగులు
కొత్తపల్లి: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు కష్టపడి చదివి ఇటీవలి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉత్తీర్ణత సాధించారు. వారి విజయాన్ని కొందరు కూటమి నాయకులు అదంతా తమ ప్రతిభేనని సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారి దూషణల వరకు వెళ్లింది. మండలంలోని మూలపేట జెడ్పీ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ప్రధమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు నియోజకవర్గంలోని ప్రైవేటు కళాశాలల కంటే అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. దీంతో గ్రామంలో ఉన్న కూటమి నాయకుడు విద్యార్థులను అభినందిస్తూ పాఠశాల వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకున్నాడు. దీంతో మరో కూటమి నాయకుడు ఆ వ్యక్తి పేరును తొలగించి తన పేరుతో తయారు చేసుకున్న ఫ్లెక్సీని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. దీంతో వారి ఇద్దరి మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిగతంగా దూషణలు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు కూటమి నాయకుల మధ్య కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ నిర్వహించారు.


