నరకం చూపాడని కొట్టి చంపారు! | - | Sakshi
Sakshi News home page

నరకం చూపాడని కొట్టి చంపారు!

Aug 17 2024 2:34 AM | Updated on Aug 17 2024 1:32 PM

-

ప్రేమించి హింసించాడని కక్ష

 చెల్లెలి బాధ చూడలేక స్నేహితుడితో కలసి యువకుడిని హత్య చేసిన సోదరుడు

 పోలీసుల అదుపులో నిందితులు

మలికిపురం: ఎన్నో ఊసులు చెప్పాడు.. మరెన్నో ఆశలు కల్పించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని ఇంటి నుంచి తీసుకువెళ్లాడు.. తర్వాత నరకం చూపించాడు. గంజాయికి బానిసైన ఆ యువకుడు తన ప్రియురాలిని కూడా గంజాయి తాగమని బలవంతం చేసేవాడు. ఆ మత్తులో యువతిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించాడు. చివరికి ఆ బాధ భరించలేని ఆ యువతి ఆ యువకుడి చెర నుంచి తప్పించుకుని తన అన్న వద్దకు చేరుకుంది. జరిగిన విషయం చెప్పి విలపించింది. అక్కున చేర్చుకున్న యువతి సోదరుడు పథకం వేశాడు. 

నమ్మించి మోసం చేసిన ఆ యువకుడిని యువతి, సోదరుడు, అతని స్నేహితుడు కలసి హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రాజోలులో సీఐ గోవిందరాజు వివరాలు వెల్లడించారు. ఆ ఆసక్తికర విషయాలు ఇలా.. మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామానికి చెందిన రాపాక ప్రశాంతి, మలికిపురానికి చెందిన పడమటి నోయల్‌ జార్జి (19) ప్రేమించుకున్నారు. ఆరు నెలలు కాకినాడలో సహజీవనం చేశారు. నోయల్‌ మద్యం, సిగరెట్లు తాగుతూ, గంజాయికి బానిస అయ్యాడు. తనతోపాటు ప్రశాంతిని కూడా తాగమని ఇబ్బంది పెట్టి శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. దీనిని తట్టుకోలేక ప్రశాంతి ఈ నెల 9న కాకినాడ నుంచి గుడిమెళ్లంకలో తన అన్నయ్య రాపాక ప్రకాష్‌ వద్దకు వచ్చేసింది. అక్కడ నోయల్‌ జార్జి బాధపెట్టిన విషయాలు చెప్పి విలపించింది.

పథకం రచించి..
తన చెల్లెలిని బాధ పెట్టిన నోయల్‌ జార్జిపై కక్ష తీర్చుకోవాలని రాపాక ప్రసాద్‌ పథకం రచించాడు. అతని స్నేహితుడైన రాజోలు గ్రామస్తుడు యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్‌, చెల్లి రాపాక ప్రశాంతితో కలిసి నోయల్‌ జార్జిని చంపేయాలని ప్లాన్‌ చేశాడు. 9న రాత్రి రాపాక ప్రశాంతి సెల్‌ నుంచి నోయల్‌ జార్జికి ఫోన్‌ చేయించి దిండి– చించినాడ బ్రిడ్జి వద్దకు రావాలని చెప్పించాడు. అక్కడి రాగానే ఇనుప రాడ్లతో నోయల్‌ జార్జిని కొట్టి చంపి బ్రిడ్జి పైనుంచి గోదావరిలోకి పడేశారు. నోయల్‌ జార్జి తీసుకువచ్చిన మోటార్‌ సైకిల్‌ను బ్రిడ్జి వద్ద పెట్టి అక్కడ నుంచి నోయల్‌ జార్జి అదృశ్యమైనట్లు సృష్టించి పారిపోయారు. 

రెండు రోజుల తర్వాత నోయల్‌ జార్జి తండ్రి పడమటి రత్నంరాజు తన కుమారుడి ఆచూకీ కోసం ఫిర్యాదు చేయగా మలికిపురం ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 12న నోయల్‌ జార్జి మృతదేహం అంతర్వేది పల్లిపాలెం అన్నాచెల్లెలు గట్టు సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాపాక ప్రసాద్‌, రాపాక ప్రశాంతి, యర్రంశెట్టి ప్రేమ్‌కుమార్‌లను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ గోవిందరాజు వివరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement