సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటా..
● అధికారుల వద్ద ఓ వ్యక్తి నిరసన
● అడ్డుకున్న కలెక్టరేట్ సిబ్బంది
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తన సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కరించకుంటే పురుగు మందు తాగుతానని జేబులో నుంచి తీయడంతో అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ పెద్ద మార్కెట్‌కు చెందిన తాళ్లూరి కృష్ణమోహన్ తన స్థలం కబ్జాకు గురైందని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టరేట్‌కు వచ్చి తన సమస్య పరిష్కరించకుంటే ఇక్కడే చనిపోతానని జేబులో నుంచి పురుగు మందు డబ్బా బయటకు తీయబోగా, అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని వారించి జేసీ అపూర్వ భరత్ వద్దకు తీసుకు వెళ్లారు. బాధితుడితో జేసీ మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాకినాడ త్రీ టౌన్ ఎస్‌ఐ భీష్మ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


