సంగతాలెన్నో..
రాయవరం: అనుభవాలను అక్షరాల్లోకి మార్చి, పుటలుగా పేర్చితే.. డైరీ అవుతుంది. మనసు స్పందించే ప్రతి భావాన్ని, సంఘటనను, ప్రతి ఆలోచనను తనలో నిక్షిప్తం చేసుకునే అపురూప పుస్తకం ఈ డైరీ. గుండె పొరల్లో ఒదిగి ఉన్న జ్ఞాపకాలు, కంటి వెనుక కలలను అందంగా తనలో అమర్చుకుంటుందీ హస్త భూషణం. అందుకే ఎన్ని మారినా డైరీ మారలేదు. దాని ప్రాధాన్యం తగ్గలేదు. మరో రెండు రోజుల తర్వాత ‘2025’ గతంలోకి వెళ్లి 2026 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ గత కాలపు జ్ఞాపకాన్ని దాచి పెట్టడానికి డైరీలు ఉంది. కొత్త ఏడాదికి సరికొత్త రూపంలో డైరీలు స్వాగతం పలుకుతున్నాయి. పాత డైరీలు గత జ్ఞాపకాలను మూటకట్టుకున్నాయి. కొత్త డైరీల్లో రేపటి కోసం కొత్త పేజీలు ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచే వీటి కొనుగోలు ఆరంభమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నగరాలు, పట్టణాల్లోని పుస్తక విక్రయ శాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో డైరీలు విరివిగా లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.30 నుంచి రూ.వెయ్యి విలువ చేసేవి విక్రయిస్తున్నారు. వీటిని హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రధాన పట్టణాల్లో ఒక్కో షాపు యజమాని రూ.30 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే డైరీలను ఇప్పటికే విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. వీటిని తమ స్నేహితులు, బంధువులకు బహుమతులుగా ఇచ్చేందుకు చాలామంది ఉత్సుకత చూపుతున్నారు.
వ్యక్తిగతం.. నిక్షిప్తం
పర్సనల్ డైరీ అంటే.. ఓ వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత అంశాలను అందుకే నిక్షిప్తం చేస్తారు. ప్రతి రోజు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాత్రి వేళ నిద్ర పోయే ముందు ఆ రోజున రాసుకుంటారు. తమ జీవితంలో ఎన్నో ముఖ్య విషయాలు, తీపి జ్ఞాపకాలను అందులో పొందుపర్చుకుంటారు. వాటిని కొంతకాలం తర్వాత తెరిచి చదివి పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవచ్చు.
ప్రొఫెషనల్ డైరీలు
వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉండేవారు, క్రమం తప్పకుండా ఉపయోగించేవి ప్రొఫెషనల్ డైరీలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ డైరీ ఓ పర్సనల్ ఆసిస్టెంట్‌గా సహకరిస్తుందంటే అందులో అతిశయోక్తి లేదు. దైనందిన వ్యవహారాలను మర్చిపోకుండా సమయానుకూలంగా చేయాల్సిన పనిని చెబుతుంది. ఈ డైరీ రోజువారీ షెడ్యూల్ మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివాహాలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ఊరు ప్రయాణాలతో పాటు సమావేశాల తేదీలను, సమాచారాన్ని అందులో రాసుకోవచ్చు. ప్రణాళికతో కూడిన పనులను చేసేందుకు డైరీ సగటు మానవునికి ఎంతగానో ఉపకరిస్తుంది.
ఫ జ్ఞాపకాలను పేర్చిన పుస్తకం డైరీ
ఫ గతాన్ని నిక్షిప్తం చేసే సాధనం
ఫ వీటికి తగ్గని ప్రాధాన్యం


