సామర్లకోటకు ‘ఎర్నాకుళం రైలు’ ప్రమాద బాధితులు
సామర్లకోట: టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలు అగ్ని ప్రమాద బాధితులను అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి సోమవారం ఉదయం కాకినాడ జిల్లా సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఈ రైలులోని రెండు బోగీల్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి విజయవాడకు చెందిన ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ఆ రెండు బోగీల్లో మిగిలిన సుమారు 125 మంది ప్రయాణికులను మూడు బస్సుల్లో సామర్లకోట తీసుకు వచ్చారు. వారిని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆధ్వర్యాన పోలీసులు, రైల్వే అధికారులు, సిబ్బంది విశ్రాంతి గదులకు తరలించారు. అనంతరం, సోమవారం ఉదయం 10.25 గంటలకు ఆ రైలు సామర్లకోట చేరుకుంది. కాకినాడ నుంచి 2, విశాఖపట్నం నుంచి ఒకటి చొప్పున ఏసీ బోగీలు తీసుకువచ్చి ఆ రైలుకు తగిలించి, బస్సుల్లో తీసుకు వచ్చిన ప్రయాణికులను ఎక్కించామని సామర్లకోట స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ తెలిపారు. ఆ ప్రయాణికులకు స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుగు బాబీ, కోశాధికారి యేలేటి రమేష్‌లు అల్పాహారం, వాటర్ బాటిల్స్ అందించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ ఆయా శాఖల అధికారులు ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. యలమంచిలిలో ప్రమాదం జరిగిన సమయంలో రైలులోని తన బ్యాగ్ చోరీ అయ్యిందని సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రతీష్ కుమార్ స్థానిక ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫ యలమంచిలి నుంచి
ప్రత్యేక బస్సుల్లో రాక
ఫ బోగీలుఏర్పాటు చేసి రైలులో తరలింపు
సామర్లకోటకు ‘ఎర్నాకుళం రైలు’ ప్రమాద బాధితులు


