యువకుడి దుర్మరణం
కడియం: స్థానిక కెనాల్ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. జేగురుపాడు పరిధి పాములమెట్ట కాలనీకి చెందిన జగతా వీరవెంకట సత్యశివశంకర్ (19) మోటారు సైకిల్‌పై వెళుతూ కారును తప్పించబోయి ఎదురుగా వస్తున్న గ్రావెల్ లోడు లారీని ఢీకొని రోడ్డుపై పడిపోయాడని పోలీసులు తెలిపారు. దీంతో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కడియం ఎస్‌ఐ ప్రసన్న ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మొబైల్ షాపులో చోరీ
శంఖవరం: కత్తిపూడిలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగినట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆ గ్రామంలోని తవ్వల రాజేష్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో చొరబడి 13 శ్యామ్‌సంగ్ ఫోన్లు దొంగిలించారు. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు వివరించారు. క్లూస్ టీమ్‌తో వేలు ముద్రలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కరపలో భారీ చోరీ
ఫ 31 కాసుల బంగారం అపహరణ
కరప: వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి.. ఇంట్లోకెళ్లి బీరువా తెరచి చూస్తే బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయిన ఘటన కరపలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో సోమవారం ఈ భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా బద్దలు కొట్టి 31 కాసుల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక నీలయ్యతోట వీధిలోని ఒక డాబాలో సలాది వీరవెంకట సత్యనారాయణ (వీరబాబు), అతని భార్య రాణి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరబాబు సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అతని భార్య రాణి ఒక ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరబాబు బయటకు వెళ్లారు. రాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్కూల్‌కు వెళ్లారు. ప్రతి రోజూ ఆమె స్కూలుకెళ్లేటప్పుడు తలుపులకు తాళం వేసి, తన భర్తకు తెలిసేలా మేడ మెట్ల కింద ఒక డబ్బాలో తాళం పెడుతుండడం జరుగుతుంది. వీరబాబు పని నుంచి మధ్యాహ్నం సమయంలో వచ్చాక డబ్బాలోని ఆ తాళం తీసుకోవడం రోజూ జరుగుతూ వస్తోంది. వీరబాబు సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి, డబ్బు అవసరమై బీరువా లాకర్ తెరచి చూసేసరికి అందులోని బంగారు నగలు, రూ.లక్ష నగదు కనిపించలేదు. దీంతో కంగారుపడిన వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరప ఎస్‌ఐ టి.సునీత సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాల వారిని పిలిచి వివరాలు అడిగారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆ ప్రాంతాల్లో వేలుముద్రలు, ఆధారాలను సేకరించారు. దొంగలు మేడ మెట్ల కింద ఉంచే తాళం తీసుకుని ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరచి బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అంతా తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కరప పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి దుర్మరణం


