సీనియారిటీ నేతిబీర | - | Sakshi
Sakshi News home page

సీనియారిటీ నేతిబీర

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

సాక్షి, అమలాపురం: పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసినా పదవులు దక్కడం లేదు.. ఎన్నికల్లో అవకాశాలు చేజారినా.. పార్టీని వీడకుండా కొనసాగినా గుర్తింపు రావడం లేదు.. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారికి మాత్రం కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. టీడీపీలో సీనియారిటీకి ప్రాధాన్యం తగ్గుతోందనే చర్చకు కోనసీమ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎంపిక మరో ఉదాహరణగా నిలిచింది. తొలి నుంచీ పార్టీలో కొనసాగుతున్న బీర సత్యకుమారిని కాదని, ఏడాది క్రితమే టీడీపీలో చేరిన గొల్లపల్లి అమూల్యకు జెడ్పీ పీఠం కట్టబెట్టడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది. ఇప్పటికే రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమూల్యకు మరో కీలక పదవి దక్కింది. సత్యకుమారికి మద్దతుగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ససేమిరా అనే అంది.

నాడు సీనియారిటీకి ప్రాధాన్యం

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 2014లో టీడీపీ మెజార్టీ సాధించింది. అప్పట్లో మామిడికుదురు, ఐ.పోలవరం జెడ్పీటీసీ సభ్యులు నామన రాంబాబు, పేరాబత్తుల రాజశేఖర్‌ మధ్య చైర్మన్‌ పదవికి పోటీ ఏర్పడింది. రాజశేఖర్‌కు మద్దతుగా ఒత్తిళ్లు వచ్చినప్పటికీ అప్పటి పార్టీ అధినేత చంద్రబాబు సీనియారిటీకే ప్రాధాన్యమిస్తూ నామనకు అవకాశం కల్పించారు. ప్రస్తుత ఎంపికలో మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు. ఐ.పోలవరం నుంచి ఎన్నికై న బీర సత్యకుమారి, మామిడికుదురు నుంచి గెలిచిన గొల్లపల్లి అమూల్య మధ్య జెడ్పీ పీఠం కోసం పోటీ నెలకొనగా అధిష్టానం అమూల్య వైపే మొగ్గు చూపింది. దీంతో, పార్టీ విధేయత, సుదీర్ఘకాల సేవలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పైరవీలకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు కార్యకర్తల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

రెండుసార్లూ నిరాశే..

2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో టీడీపీ తరఫున బీర సత్యకుమారికి బీఫారం ఇచ్చారు. అయితే, తన భార్యకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద కోరడంతో చివరి నిమిషంలో అభ్యర్థిత్వం మారిపోయింది. అప్పట్లో అవమానకర రీతిలో టికెట్టు చేజారినా ఆమె పార్టీని వీడకుండా కొనసాగారు. కనీసం ఈసారైనా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి తనకు దక్కుతుందని ఆశించగా ఆశాభంగమే ఎదురైంది. ఆమెకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్‌ మాధుర్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌, పలువురు ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. అయినప్పటికీ అధిష్టానం అమూల్యకే అవకాశం కల్పించింది. గతంలో అసెంబ్లీ టికెట్టు, ఇప్పుడు జెడ్పీ పీఠం విషయంలో ఎదురైన పరిణామాలు సత్యకుమారి వర్గంలో నిరాశనే మిగిల్చాయి.

మామిడికుదురుకే మరోసారి

మామిడికుదురు జెడ్పీటీసీకి మరోసారి చైర్‌పర్సన్‌ పదవి దక్కడం విశేషం. 2014లో నామన రాంబాబు, ఇప్పుడు గొల్లపల్లి అమూల్య అదే స్థానం నుంచి ఎన్నికై జెడ్పీ పీఠాన్ని అధిరోహించారు.

కీలక నేతల గైర్హాజరు

ఇదిలా ఉండగా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికకు అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, దేవ వరప్రసాద్‌, ఎంపీ గంటి హరీష్‌ మాధుర్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్‌ హాజరు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సత్యకుమారికి పదవి దక్కకపోవడంపై అసంతృప్తితోనే పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

పదవుల కోసం ఎదురుచూపులు

మరోవైపు పార్టీ పరంగా తగిన గుర్తింపు దక్కడం లేదనే అసంతృప్తి జిల్లాలోని పలువురు సీనియర్‌ నేతల్లోనూ ఉంది. కొత్తపేటకు చెందిన శాసన మండలి మాజీ వైస్‌ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యానికి ఈసారి నామినేటెడ్‌ పదవి ఇవ్వడం లేదు. తనకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ వద్ద ఆయన మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. అలాగే, అమలాపురానికి చెందిన పార్టీ సీనియర్‌ మెట్ల రమణబాబు రెండున్నరేళ్లుగా రాష్ట్ర స్థాయి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ, కార్పొరేషన్‌ పదవుల విషయం అలా ఉంచితే ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పదవి కూడా దక్కలేదు. మాజీ జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు సైతం వెయిటింగ్‌ లిస్టులో ఉన్నారు. నామినేటెడ్‌ పదవి లేకపోవడం అటుంచితే పి.గన్నవరం నియోజకవర్గంలో తనకు అనుకూలమైన వ్యక్తికి ఇన్‌చార్జి పదవి ఇప్పించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన వ్యతిరేక వర్గానికి చెందిన మోకా ఆనంద సాగర్‌కు బాధ్యతలు అప్పగించారు. కొత్తపేట నియోజకవర్గానికి చెందిన ఆకుల రామకృష్ణ, ముమ్మిడివరానికి చెందిన చెల్లి వివేకానంద, అమలాపురానికి చెందిన పెచ్చెట్టి విజయలక్ష్మి, చింతా శంకరమూర్తి, పి.గన్నవరానికి చెందిన డొక్కా నాధ్‌బాబు, దంగేటి వీర వెంకట సత్యనారాయణ వంటి నేతలు కూడా పార్టీ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు.

టీడీపీలో కొత్తవారికే పదవుల పందేరం

సీనియర్లను పక్కన పెడుతున్న అధిష్టానం

పార్టీ కోసం ఏళ్ల తరబడి

పని చేసిన వారికి నిరాశ

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎంపికలోనూ అదే తీరు

తొలి నుంచీ పార్టీలో ఉన్న బీర సత్యకుమారికి మొండిచేయి

ఏడాది క్రితమే సైకిలెక్కిన

అమూల్యకు పీఠం

ఎమ్మెల్యేలు, ఎంపీ మద్దతున్నా

అధిష్టానం ససేమిరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement