● నాటకీయ పరిణామాల
నడుమ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక
● మండలాధ్యక్షుడిగా గంటా విజయ్ కుమార్
● వైస్ ఎంపీపీగా వాడ్ర ధనబాబు
కొత్తపల్లి: పదహారు మంది సభ్యుల మద్దతుందన్న ఓ వర్గం ఎంపీపీ పదవి తమవారికే ఇవ్వాలని పట్టుబట్టింది. గళమెత్తింది. నిరసనలు తెలిపింది. వైరి వర్గం కూడా తగ్గేదే లేదన్నట్లు ఎంపీపీ పదవి తమదేనంది. అవతలి వారిని చెంపదెబ్బలు సైతం కొట్టింది. మొత్తం మీద ఇరువర్గాలూ ఒత్తిడి తీసుకురావడంతో అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. ఇవన్నీ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నికలో గురువారం చోటుచేసుకున్న పరిణామాలు. పొద్దు పోయింది. రాత్రి గడిచింది. తెల్లారింది. అంతే.. ఏం జరిగిందో, ఎవరేం ‘మంత్రం వేశారో’ కానీ సీన్ మొత్తం మారిపోయింది. పీఠం తమదేనన్న వర్గం చప్పున చల్లారిపోయింది. నిన్నటి వరకూ ఎంపీపీ పదవి తమదేనన్న వారు.. వైరి వర్గంలోని వారికే సై అన్నారు. వారికే మండల పీఠాన్ని కట్టబెట్టేశారు.
కొత్తపల్లి మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ), ఉపాధ్యక్ష (వైస్ ఎంపీపీ) ఎన్నికలు శుక్రవారం తీవ్ర ఉత్కంఠ మధ్య సాగాయి. గురువారం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వర్గానికి చెందిన గంటా విజయ్ కుమార్కు మద్దతుగా అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరించారంటూ కూటమి పార్టీల్లోని వారి వ్యతిరేక వర్గం నాయకులు, ఎంపీటీసీ సభ్యులే ఆందోళన చేసిన విషయం తెలిసిందే. నిన్న ఆందోళనకు దిగిన ఎంపీటీసీ సభ్యులే శుక్రవారం జరిగిన ఎన్నికకు మద్దతు పలకడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో కూటమి పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు గంటా విజయ్ కుమార్ను ఎంపీపీగా, వాండ్ర ధనబాబును వైస్ ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎంపీడీఓ లక్ష్మీరెడ్డి తదితరులు హాజరయ్యారు. విజయ్ కుమార్ వ్యతిరేక వర్గానికి చెందిన ఎంపీటీసీ సభ్యుల్ని ఎంపీతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ బుజ్జగించారని కూడా చెబుతున్నారు.
ఎంపీపీగా విజయ్ కుమార్ను నిన్నటి వరకూ వ్యతిరేకించిన వారు ఒక్కసారిగా మద్దతు పలకడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. దీని వెనుక ప్రలోభాలు బాగానే పని చేసినట్టున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కుమార్ మొదటి రెండున్నరేళ్లు, ధనబాబు తరువాతి రెండున్నరేళ్లు ఎంపీపీగా కొనసాగేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో పాటు వ్యతిరేక వర్గానికి చెందిన కూటమి ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలు గురి చేశారనే ఆరోపణలు సైతం వినిపించాయి. ఎంపీపీ పదవి కోసం వ్యతిరేక వర్గం ఎంపీటీసీ సభ్యులకు రూ.లక్షల్లో ఎర వేశారంటూ ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విచిత్రాలు చూసిన మండల వాసులు ఇవేం రాజకీయాలంటూ నివ్వెరపోతున్నారు.


