అమలాపురం రూరల్: జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నికల్లో కూటమి నాయకులు అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించారు. అమలాపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ ఎన్నికలకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, జెడ్పీటీసీ సభ్యులను మాత్రమే తొలుత అనుమతించారు. అనంతరం, మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు కూటమి నాయకులు కూడా జెడ్పీ సమావేశ మందిరానికి చేరుకున్నారు. ఎన్నిక జరిగిన సమయంలో జెడ్పీటీసీ సభ్యులు మాత్రమే సమావేశంలో ఉండాలని, ఇతర వ్యక్తులు వెళ్లిపోవాలని సీఈఓ వసంత మాధవి. జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి సూచించినప్పటికీ కూటమి నాయకులు పట్టించుకోలేదు. మీడియాకు మాత్రం అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నిక జరిగిన సమయంలో జెడ్పీటీసీ సభ్యులతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, టీడీపీ, జనసేన కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు కూడా సమావేశ మందిరంలోనే ఉన్నారు. చేసేదేమీ లేక అధికారులు ఎన్నికలు జరిపించారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా గొల్లపల్లి అమూల్య ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరెంటు పోయింది. కొంతసేపటికి జనరేటర్ ఏర్పాటు చేశారు. ఎన్నిక ముగిసేంత వరకు కరెంటు రాలేదు. అలాగే, జెడ్పీ సీఈఓ మాట్లాడే సమమంలో మైకు మూగబోయింది.
ఎన్నికల ఖర్చులు
ఇప్పించండి సార్!
● సొంత నిధులు వెచ్చించి
విధుల నిర్వహణ
● కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన
పంచాయతీ కార్యదర్శులు
రంపచోడవరం: ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణకు తమ సొంత నిధులు ఖర్చు చేశామని, ఆ సొమ్ము ఇప్పటివరకు తిరిగి చెల్లించలేదని పలువురు పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని, ఆ సొమ్ము వెంటనే రీయింబర్స్ కోరుతూ వారు కలెక్టర్ కె.దినేష్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల విధుల నిర్వహణ సందర్భంగా అవసరమైన ఖర్చులను ముందుగా తమ సొంత నిధులతో సమకూర్చుకోవాలని, అనంతరం నిధులు మంజూరైనప్పుడు తిరిగి చెల్లిస్తామని సంబంధిత ఎంపీడీఓలు, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని కలెక్టర్‌కు వివరించారు. అధికారుల సూచనల మేరకు కొంతమంది అప్పులు చేసి, మరికొంతమంది వ్యక్తిగత పొదుపు మొత్తాలను వినియోగించి ఎన్నికల విధులు నిర్వహించామని చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్య ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, ఖర్చులు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శులకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చి, ఆ వినతిపత్రంపై సంతకం చేసి తదుపరి చర్యల నిమిత్తం పీఏకు అందజేశారు. అనంతరం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిని సైతం పంచాయతీ కార్యదర్శులు కలిసి సమస్యను వివరించారు.
వైఎస్సార్ సీపీలోకి
32 కుటుంబాలు
వీఆర్‌పురం: పెద్దమట్టపల్లి పంచాయతీ రామపురంలో మాజీ సర్పంచ్ పిట్టా రామారావు, కోటం జయరాజు ఆధ్వర్యాన సీపీఎంకు చెందిన 32 కుటుంబాలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా సీపీఎంలో ఉన్నామని, అయినా గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేశారని, అందుకే వైఎస్సార్ సీపీలో చేరేందుకు మక్కువ చూపామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు కలుముల రాముడు, లచ్చయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు గుప్పెనపల్లి వీరస్వామి, ఉయిక నాగేశ్వరరావు, చిలకా హిరమరాజు, పూనెం రమేష్, బధం నాగేశ్వరరావు, దూలయ్య తదితరులు పాల్గొన్నారు.


