మాయదారి నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మాయదారి నిర్లక్ష్యం

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

● మూడు నియోజకవర్గాలకు

ప్రధాన రహదారి

● భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రం

● వెదురుమూడి రోడ్డును

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

పట్టించుకోని సర్కారు

కొత్తూరు – వెదురుమూడి రహదారి దుస్థితిపై ఆర్‌అండ్‌బీ అధికారులు ఏటా నివేదికలు పంపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ రహదారిని అభివృద్ధి చేయాలని, కనీస మరమ్మతులైనా చేపట్టాలని స్థానికులు ఆర్‌అండ్‌బీ అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. అయితే, నిధుల లేమితో ఈ పనులు చేపట్టలేకపోతున్నామనే ఆ శాఖ అధికారులు ప్రైవేటు సంభాషణల్లో నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దీనినిబట్టి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేననే విషయం స్పష్టమవుతోంది. ఇటీవలి భారీ వర్షాలకు ఈ రోడ్డు మరింత తీవ్రంగా దెబ్బ తింది. అయినప్పటికీ కనీసం మరమ్మత్తులు కూడా చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఓఎన్‌జీసీతో పాటు స్థానిక పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతోనైనా మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆలమూరు: అది రెండు జిల్లాల్లోని మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన రహదారి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడే ఓఎన్‌జీసీ చమురు, సహజవాయువు అన్వేషణ సాగిస్తోంది. ఇంతటి కీలకమైన ప్రాంతంలో ప్రధానమైనదిగా కొత్తూరు – వెదురుమూడి రోడ్డు దశాబ్దాలుగా నిర్లక్ష్యపు చెరలో కొట్టుమిట్టాడుతుంది. కొత్తపేట, మండపేట, రామచంద్రపురం నియోజకవర్గాలను కలిపే ఈ రోడ్డును ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు పట్టించుకోవడం లేదు. సొంత ప్రాంతాల అభివృద్ధికి ప్రాథాన్యం ఇస్తున్న ప్రజాప్రతినిధులు ఈ ఉమ్మడి రహదారిని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

రోడ్డు ప్రాధాన్యమిదీ..

మూడు దశాబ్దాల క్రితం ఈ రోడ్డుపై పదుల సంఖ్యలో మాత్రమే వాహనాలు ప్రయాణించేవి. నేడు ప్రతి రోజూ వందలాదిగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రహదారి వెంబడి ఉన్న ఆలమూరు, కపిలేశ్వరపురం, కె,గంగవరం మండలాల్లోని పలు గ్రామాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రహదారి వెంబడి ఓఎన్‌జీసీకి చెందిన 12 చమురు, సహజ వాయువు అన్వేషణ బావులున్నాయి. అంతే కాదు.. పేపరు మిల్లుతో పాటు అనేక రైసు మిల్లులు కూడా ఈ మార్గంలోనే ఉన్నాయి. ఇంటి ప్రాధాన్యమున్నప్పటికీ ఈ రహదారి అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఇవీ సమస్యలు

● పరిశ్రమలు ఉండటంతో ప్రతి రోజూ అనేక భారీ వాహనాలు ఈ రోడ్డుపై తిరుగుతున్నాయి. దీంతో, గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.

● అనేకచోట్ల ఈ రోడ్డుకు బెర్ములు విరిగిపోయాయి.

● రోజురోజుకూ మరింతగా గుంతలమయమవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు.

● వర్షాలు కురిసినప్పుడు ఆ గోతుల్లో నీరు చేరి పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది. నీటితో నిండిన గోతులను గుర్తించలేక వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

● ఇటీవలి భారీ వర్షాలకు ఇరువైపులా ఉన్న బెర్ములు పూడికతో మూసుకుపోవడంతో మొక్కలు పెరిగిపోయి ఈ మార్గమంతా చిట్టడవిలా తయారైంది.

● వాహనాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఈ రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు.

● ఐదు కిలోమీటర్ల పొడవున్న ఈ రహదారిలో అత్యధిక భాగం కపిలేశ్వరపురం మండలంలోనే ఉంది. ఒకవైపు పంట కాలువ, మరోవైపు పంట చేలు ఉండటంతో రోడ్డు తరచూ కుంగిపోతోంది.

● 3.50 మీటర్లు మాత్రమే వెడల్పు కలిగిన ఈ రోడ్డు లో నిత్యం భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో ట్రాఫిక్‌కు తరచూ అంతరాయం కలుగుతోంది.

● గత పదేళ్లలో ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో దాదాపు ఐదుగురు మృత్యువాత పడ్డారు. రెండేళ్ల క్రితం ఒక ప్రైవేట్‌ మిల్క్‌ డెయిరీకి చెందిన లారీ పంట కాలువలో బోల్తా పడింది.

ప్రతిపాదనలు పంపించాం

కొత్తూరు నుంచి చింతలూరు వరకూ సీసీ రోడ్డు నిర్మాణానికి, మిగిలిన రోడ్డు విస్తరణకు ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. పుష్కర పనుల్లో కూడా ఈ రోడ్డు అభివృద్ధి ప్రతిపాదన ఉంది. అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాం.

– టి.సూర్యనారాయణ,

ఆర్‌అండ్‌బీ డీఈ, రామచంద్రపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement