భద్రతా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భద్రతా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

● విపత్తులు నివారించాలి

● చమురు సంస్థలకు కలెక్టర్‌ ఆదేశం

అమలాపురం రూరల్‌: జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్జీసీ, వేదాంత, గెయిల్‌ వంటి చమురు, సహజవాయువు సంస్థలు విపత్తుల నివారణకు ముందస్తు భద్రతా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆయా చమురు సంస్థల ప్రతినిధులు, అగ్నిమాపక, పరిశ్రమల శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. తమ సంస్థల్లో అమలు చేస్తున్న ప్రమాదాల విశ్లేషణ, అత్యవసర స్పందన, విపత్తు నిర్వహణ ప్రణాళికలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై ఓఎన్జీసీ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, గతంలో ఇరుసుమండ, ఇటీవల తాటిపాక వద్ద చోటు చేసుకున్న బ్లో అవుట్లను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని సంస్థలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రిగ్గులు, ఆయిల్‌ ఇన్‌స్టలేషన్ల వద్ద అత్యవసర పరిస్థితులు తలెత్తితే భారీ అగ్నిమాపక వాహనాలు, రెస్క్యూ బృందాలు సులభంగా చేరుకునేలా రహదారి సౌకర్యాలను ముందుగానే పరిశీలించాలని అన్నారు. రైతుల నుంచి భూములు తీసుకునే సమయంలోనే అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. అగ్నిమాపక, పరిశ్రమల శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలని, సంబంధిత శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు అందించేందుకు అన్ని చమురు, గ్యాస్‌ సంస్థలకు ఒకేవిధమైన సైరన్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని సుమారు 280 బావులు, వాటికి అనుసంధానమైన పైప్‌లైన్ల కో ఆర్డినేట్లు, మార్కర్‌ బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని, పైప్‌లైన్ల పరిధిలో అక్రమ తవ్వకాలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో ఓఎన్జీసీ రాజమండ్రి ఈడీ, అసెట్‌ మేనేజర్‌ హేమంత్‌ ముల్కా, జిల్లా అగ్నిమాపక అధికారి ఎన్‌.పార్థసారథి, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ జీవీవీఎస్‌ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement