అమలాపురం టౌన్: వందేమాతరం గీతం 150 సంవత్సరాల వేడుకలు, వికసిత్ భారత్ సాధనను పురస్కరించుకుని అమలాపురంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ కోలాహలంగా నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, డీఆర్‌డీఏ పీడీ డి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, విద్యార్థులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి నల్లవంతెన, ముమ్మిడివరం గేట్ సెంటర్ మీదుగా గడియారం స్తంభం సెంటర్‌కు ఈ ర్యాలీ చేరుకుంది. సైకిల్ యాత్రలో పాల్గొన్న వారితో అక్కడ కలెక్టర్, ఎస్పీ తదితరులు వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


