యాప్‌సోపాలు.. | - | Sakshi
Sakshi News home page

యాప్‌సోపాలు..

Aug 14 2026 7:26 AM | Updated on Aug 14 2026 7:26 AM

అంతర పంటలున్నా ఒక పంటకే యూరియా

ఉద్యాన రైతులకు తప్పని తిప్పలు

ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ తెచ్చిన తంటా

సాక్షి, అమలాపురం/ అంబాజీపేట: ఒకే తోటలో కొబ్బరి.. మధ్యలో అరటి.. అక్కడక్కడా వక్క.. కొన్నిచోట్ల అరటి స్థానంలో కోకో.. దానితో పాటు వక్క. కోనసీమ ఉద్యాన సాగు స్వరూపం ఇది. సగానికి పైగా పంటలు ఇలా ఉంటే.. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అగ్రికల్చరల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (ఏపీ ఏఐఎంఎస్‌) యాప్‌ మాత్రం ఒక్క పంటనే చూస్తోంది. ఫలితంగా వేలాది మంది ఉద్యాన రైతులకు అవసరానికి సరిపడా యూరియా అందడం లేదు. ఇలా వారికి చిక్కులు తప్పడం లేదు.

అవసరం ఏడు.. ఇచ్చేది మూడు

ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ఓ అరటి మొక్కకు ఈ సీజన్‌లో 465 నుంచి 600 గ్రాముల వరకు యూరియా అవసరం. కొబ్బరిలో అంతర పంటగా ఎకరాకు సుమారు 650 అరటి మొక్కలు నాటుతారు. మొక్కకు సగటున 500 గ్రాముల చొప్పున లెక్కించినా 325 కిలోల యూరియా అవసరం. 45 కిలోల బస్తా చొప్పున కనీసం ఏడు బస్తాలు కావాలి. అరటిని ఏక పంటగా వెయ్యి మొక్కలు నాటుతారు. ఈ లెక్కన ఎకరాకు 11 బస్తాల వరకు యూరియా అవసరం ఉంటోంది. ప్రభుత్వం మూడు బస్తాలకే పరిమితం చేయడం ఉద్యాన రైతులను ఇబ్బందుల పాల్జేస్తోంది.

ఫ ఇక కొబ్బరిలో చెట్టుకు కిలో యూరియాను రెండు విడతలుగా అందిస్తారు. ఉద్యాన శాఖ లెక్కల ప్రకారం ఎకరాకు 60 మొక్కలు ఉంటాయి. రైతులు 70 మొక్కలు వేస్తారు. అంటే ఎకరాకు 70 కిలోల చొప్పున బస్తాన్నర యూరియాను వినియోగిస్తారు. కానీ యాప్‌ పుణ్యమా అని రైతులకు ఒక బస్తా ఇస్తున్నారు. వాస్తవంగా కొబ్బరిలో అరటి అంతర పంటగా సాగు చేసే రెండు పంటలకు 8 నుంచి 11 బస్తాల వరకు యూరియా అవసరం. కాని ఇందులో సగం కూడా ఇవ్వడం లేదు.

40 వేల ఎకరాల్లో అంతర పంటలు

జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా.. దాదాపు 40 వేల ఎకరాల్లో అంతర పంటలు సాగవుతున్నాయి. కొబ్బరిలో కోకో, అరటి, వక్క, పసుపు, కంద, కూరగాయలు, పూల సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కొబ్బరితో పాటు అరటి లేకుంటే కోకో, వక్కను కూడా ఒకేసారి సాగు చేస్తున్నారు. అంటే ఒకే ఎకరంలో మూడు పంటలు ఉన్నా.. యాప్‌లో మాత్రం కొబ్బరి లేదా అరటిలో ఏదో ఒక పంటగానే నమోదు చేసే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. ఉద్యాన రైతులు మిశ్రమ పంటలు సాగు చేస్తే ఆదాయం పెరుగుతోందని ఒకవైపు రైతులను ప్రోత్సహిస్తున్న ఉద్యాన శాఖ.. మరోవైపు యాప్‌లతో యూరియా సరఫరాకు కొర్రెలు వేయడంపై రైతులు మండిపడుతున్నారు.

ఇప్పుడైనా అందిస్తే..

సాధారణంగా వేసవిలో దుక్కులు పూర్తి చేసుకుని.. వర్షాలు పడిన తర్వాత జూన్‌, జులైలో కొబ్బరి, అరటి తోటలకు తొలి విడత ఎరువులు వేస్తారు. రెండవ దఫా సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్యలో అందిస్తారు. ఎల్‌నినో వల్ల ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో ఎరువుల వినియోగం కూడా ప్రభావితమైంది. ప్రస్తుతం అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు పడుతుండటంతో తోటలకు యూరియా వేయాల్సిన సమయంలో రైతులకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement