అమలాపురం రూరల్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ, నోటీసుల జారీ, పంపిణీ, అభ్యంతరాలు వంటి అంశాలపై అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్‌చంద్ర పూనేఠా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ వేగవంతం చేసే ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నోటీసుల జారీ, విచారణ వంటి విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో మిగిలిన 30 వేల పైచిలుకు నోటీసుల బట్వాడాను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు.
ఫ ట్రాఫిక్ నియంత్రణ దృష్టిలో ఉంచుకుని చించినాడ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నేషనల్ హైవే 216ఈ, విద్యుత్ శాఖ, కాంట్రాక్టర్లు అధికారులతో విద్యుత్ టవర్ లైన్ పనులు, రోడ్డు విస్తరణ, చించినాడ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ నెల 31 నాటికి చించినాడ బ్రిడ్జి పనులు పూర్తి చేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైడియాదేవి, ఆర్డీఓలు సరళావతి, జీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం
అమలాపురం రూరల్: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని డీఈఓ షేక్ మహబూబ్ బాషా తెలిపారు. గురువారం అమలాపురం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అమరావతి చాంపియన్ షిప్ –2026 కోసం జిల్లా స్థాయి చాంపియన్ షిప్–కమ్– సెలెక్షన్ నిర్వహించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామని డీఎస్‌ఓ వైవీ రుద్ర తెలిపారు. జిల్లా టురిజం అధికారి అన్వర్, సీపీఓ మురళీకృష్ణ, డీవైఈఓ కిషోర్‌బాబు మాట్లాడుతూ హాకీ, బాస్కెట్‌బాల్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ తదితర పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేశామన్నారు. సెక్రటరీలు కె.ఈశ్వర్, ఏఎస్‌ఎస్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇష్టారాజ్యంగా
అక్రమ విద్యుత్ కనెక్షన్లు
కాట్రేనికోన: స్థానికంగా ఓ వాణిజ్య సముదాయంలో రెండు దశాబ్దాలుగా నిబంధనలను ఉల్లంగించి విద్యుత్ దోపిడీ జరుగుతోంది. నిబంధనలను తుంగలోకి తొక్కి పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి 16 కమర్షియల్ సర్వీసులను ఆ సముదాయాలకు వాడుతున్నారు. అదనపు సర్వీసు కోసం విద్యుత్ శాఖ అధికారులపై కూటమి నాయకులు తీవ్ర ఒత్తిడి చేయడంతో అసలు బాగోతం బయట పడింది. వ్యాపార సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, పరిశ్రమలు విద్యుత్ లోడ్ ఆధారంగా, ఐదు సర్వీసులు మించితే సొంత ట్రాన్స్‌ఫార్మర్ వేయించుకోవాలి. గతంలో పనిచేసిన అధికారులు చేతివాటం, రాజకీయ ఒత్తిడితో దఫదఫాలుగా 16 కమర్షియల్ సర్వీసులను పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్‌పై మంజూరు చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. దీనివల్ల లోవోల్టేజీ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్‌ఫార్మర్‌పై 16 కమర్షియల్ సర్వీసులు ఉన్నాయని, మరో సర్వీసు కావాలని అడిగారని, నిబంధనలు ప్రకారం ఇవ్వడం కుదరని చెప్పామని కాట్రేనికోన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ నీలయ్య అన్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ వేయించుకోవాలని సంబంధిత యాజమాన్యానికి చెప్పామన్నారు. అక్రమ కమర్షియల్ సర్వీసులను తొలగిస్తామని చెప్పారు.


