పంటలను చూసి ఎరువుల అవసరాన్ని నిర్ణయించాలే తప్ప.. యాప్‌లోని ఒక కాలమ్‌ను చూసి బస్తాల సంఖ్య ఖరారు చేయడం సరికాదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. యాప్ నిబంధనలతో సంబంధం లేకుండా రైతులకు అవసరమైన ఎరువులను అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూరియాతో పాటు ఎరువులు అందకపోవడంపై రామారావు ఆధ్వర్యంలో పార్టీ రైతు విభాగం నాయకులు, ఇతర అనుబంధ విభాగాల నాయకులు గురువారం పరిశీలించారు. అంబాజీపేట సచివాలయంలో యాప్ పనితీరును ఉద్యాన శాఖ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఒక రైతుకు చెందిన 3.70 ఎకరాలకు గాను అరటి పంటకు సంబంధించి యాప్‌లో 13 బస్తాలు యూరియా చూపిస్తోంది. కానీ ఆ తోటలో కొబ్బరితో పాటు అరటి, పోక, బత్తాయి సాగువుతోందని గుర్తించారు. దీనిపై అంబాజీపేట, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలను బాబితో పాటు రైతులు వివరాలు సేకరించారు. రైతులు వాడే స్థాయిలో కాకున్నా కనీసం శాస్త్రవేత్తలు సిఫార్సు చేసినట్టుగానైనా రైతులకు యూరియా అందించాలని బాబి డిమాండ్ చేశారు. ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, ఎస్‌ఈసీ సభ్యుడు కుడిపూడి భరత భూషణ్, రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శి కొర్లపాటి కోటబాబు, గబ్బుల రమేష్, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు, మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్ర శేఖర్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు దొమ్మేటి సత్యమోహన్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు తులా గోపాలకృష్ణ, రైతులు కొర్లపాటి చంటి, మట్టపర్తి పరమేశ్వరరావు, సూదాబత్తుల రాము తదితరులు పాల్గొన్నారు.


