జగనన్నను చూసిన వేళ.. ఆనందహేల
నిన్నమొన్నటి వరకూ లక్షల క్యూసెక్కుల వరద నీటితో పావన గోదావరి పరవళ్లు తొక్కింది. ఆ నదీమతల్లి పరవళ్లను తలపించేలా.. రహదారిపై జనగోదారి వెల్లువెత్తింది. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడుగు పెట్టిన వేళ.. దేవరపల్లిలో ప్రభం‘జనం’ ఎగసిపడింది. అంతటా అంధకారం అలముకున్న వేళ.. వెలుగులు నింపే సూర్యుడిలా.. చీకట్లు నిండిన పొగాకు రైతుల బతుకుల్లో భరోసా నింపేందుకు.. పుట్టెడు కష్టాల్లో ఉన్న వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు వచ్చిన ఆయనకు.. ఉప్పెనలా కదలి వచ్చిన ప్రజలు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ.. తమ ప్రియనేతతో కరచాలనం చేసేందుకు ఉత్సాహతరంగమై కదం తొక్కారు. ఆత్మీయతతో కదలివచ్చిన ఆ జనకెరటాలు.. జననేతపై ప్రజల్లో చెరగని ప్రేమాభిమానాలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి.
సాక్షి, రాజమహేంద్రవరం: సిండికేట్ అయిన కంపెనీలు ఏకపక్షంగా ధర తగ్గించేస్తున్నాయి.. ఆర్డర్లు ఖరారు కాలేదనే సాకుతో అంతంత మాత్రంగానే కొనుగోళ్లు జరుపుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా బేళ్లను భారీగా తిరస్కరిస్తున్నాయి.. ఈపాటికే కొనుగోళ్లు పూర్తి కావాల్సి ఉండగా.. కంపెనీల మాయాజాలంతో రైతుల వద్దనే వేల కోట్ల రూపాయల విలువైన పొగాకు ఉండిపోయింది.. కొనుగోళ్లలో జాప్యం, వాతావరణ ప్రభావంతో దాని నాణ్యత దెబ్బ తింటున్న దుస్థితి.. ఈ పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం, అటు పొగాకు బోర్డు పట్టించుకోకపోవడంతో ఈసారి తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుందంటూ రైతులు తల్లడిల్లిపోతున్నారు. వారికి అండగా నిలిచేందుకు, భరోసా నింపేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చిన వేళ దేవరపల్లి బుధవారం జనసాగరాన్ని తలపించింది. ఈ రైతుపోరులో రైతులు, యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉత్సాహతరంగాలై కదం తొక్కడంతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనం.. అభిమాన నేతకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపించి అపూర్వంగా స్వాగతించారు. సీఎం.. సీఎం.. నినాదాలతో హోరెత్తించారు.
2 కిలోమీటర్లు.. 2.30 గంటలు
దేవరపల్లి శివారు సంతమార్కెట్ సమీపాన ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు బుధవారం ఉదయం 10:30 గంటలకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని పొగాకు వేలం కేంద్రానికి చేరుకునేందుకు 2.30 గంటల సమయం పట్టింది. వేలాదిగా తరలివచ్చిన రైతులు, యువత, అభిమానులు, వైఎస్సార్ సీపీ శ్రేణులు దారి పొడువునా ప్లకార్డులు, ఫ్లెక్సీలతో జగన్‌కు స్వాగతం పలికారు. మార్గం మధ్యలో భారీ గజమాలతో సత్కరించారు. ఓవైపు ఎండ మండిపోతున్నా.. చెక్కు చెదరని చిరునవ్వుతో వారందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. హెలిప్యాడ్ నుంచి దేవరపల్లి బస్టాండ్, వై జంక్షన్ మీదుగా మధ్యాహ్నం 12:50 గంటలకు పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్న జగన్.. అక్కడి రైతులతో మాట్లాడారు. త్వరలోనే మన ప్రభుత్వం వస్తుందని.. అప్పుడు మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చారు.
మండుటెండలోనూ నిండైన అభిమానంతో..
తమ అభిమాన నేత జగన్‌ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయలేదు. నడినెత్తిన సూర్యుడు చండప్రచండంగా నిప్పులు కురిపిస్తున్నా.. రెండున్నర గంటలపాటు దిక్కులు పిక్కటిల్లేలా ‘జై జగన్’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. యువకులైతే జగన్‌ను చూసేందుకు చెట్ల పైకి ఎక్కి నిరీక్షించారు. మహిళలు, యువతులు, ఇతర ప్రజలు దారి పొడవునా మేడల పైకి చేరుకుని అభిమాన నేతకు స్వాగతం పలికారు.
స్వాగతం పలికిన నేతలు
పొగాకు రైతులకు మద్దతుగా రైతుపోరుకు దేవరపల్లి వచ్చిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్‌నాథ్, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కౌరు శ్రీనివాస్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొఠారు అబ్బయ్య చౌదరి, తెల్లం బాలరాజు, ముదునూరు ప్రసాదరాజు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు (జీవీ), అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ కోనసీమ, ఏలూరు జిల్లాల అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, దూలం నాగేశ్వరరావు, భీమవరం ఇన్‌చార్జి చిన్నమిల్లి వెంకటరాయుడు, తాడేపల్లిగూడెం కో ఆర్డినేటర్ వడ్డి రఘురాం, చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి విజయరాజు, జెట్టి గురునాథరావు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవరపల్లిలో పోటెత్తిన జనగోదారి
పొగాకు రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న జగన్
అధినేత జగన్‌కు స్వాగతం పలుకుతున్న మాజీ హోం మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణు
చంద్రబాబు పాలనలో రైతులకు అన్యాయమే
ప్లకార్డులతో యువకుల జోష్...
ఫ దేవరపల్లిలో జనగోదారి
ఫ రైతుపోరుకు వేలాదిగా
తరలివచ్చిన రైతులు, ప్రజలు
ఫ జననేతకు అడుగడుగునా బ్రహ్మరథం
ఫ వైఎస్ జగన్ పర్యటనతో
పొగాకు రైతులకు భరోసా


