పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

Aug 6 2026 2:32 AM | Updated on Aug 6 2026 2:32 AM

అమలాపురం రూరల్‌: వచ్చే ఏడాది జూన్‌ 26 నుంచి జూలై 7వ తేదీ వరకూ జరిగే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలూ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. పుష్కరాల నిర్వహణపై ఆరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున మౌలిక సదుపాయాలు, భద్రత, పారిశుధ్యం, రవాణా, వైద్యం, తాగునీరు, ఘాట్ల నిర్వహణ, అభివృద్ధి వంటి అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పుష్కరాలకు వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టామని చెప్పారు. అంతర్వేది, అప్పనపల్లి, కోటిపల్లి, కుండలేశ్వరం పుష్కర ఘాట్ల నిర్వహణ, అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పుష్కర ఘాట్ల నిర్వహణతో పాటు పర్యాటకాభివృద్ధిలో జల క్రీడల ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో ఎస్పీ రాహుల్‌ మీనా, డీఆర్‌ఓ వి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలకు అండగా..

తాడికోనలో నేడు చిర్ల జగ్గిరెడ్డి పర్యటన

రావులపాలెం: అల్లవరం మండలంలో క్రాప్‌ హాలిడే ప్రకటించిన తాడికోన గ్రామ రైతులకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. బాధిత రైతులకు పార్టీ తరఫున భరోసా ఇవ్వడానికి ఆ గ్రామంలో గురువారం ఉదయం 11 గంటలకు పర్యటించనున్నామని పేర్కొన్నారు. బాధిత రైతుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి న్యాయం జరిగేలా వారి పక్షాన పోరాడతామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకూ తమ పోరాటం ఆగదని జగ్గిరెడ్డి స్పష్టం చేశారు.

మంత్రి మల్లాడికి

పలు శాఖల కేటాయింపు

యానాం: మూడు నెలల కిందట మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురికి ఎట్టకేలకు శాఖలు కేటాయిస్తూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాషనాథన్‌ బుధవారం రాత్రి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు పబ్లిక్‌ వర్క్స్‌ (పీడబ్ల్యూడీ), పర్యాటక, పౌర విమానయానం, పోర్టు, మత్స్యకారుల సంక్షేమం, పరిశ్రమలు, వాణిజ్యం, కార్మిక, ఉపాధి శాఖలు కేటాయించారు. నమశ్శివాయానికి హోం, విద్యుత్‌, విద్య తదితర శాఖలు, రాజవేలుకు ఆదిద్రావిడ, హౌసింగ్‌, సమాచార, సాంకేతికత, శివకొళిందుకు పౌర సరఫరాలు, సామాజిక సంక్షేమం, బీసీ సంక్షేమం, రాజశేఖరన్‌కు వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆర్థిక, పరిపాలనా సంస్కరణలు, రెవెన్యూ, ఎకై ్సజ్‌, ఆరోగ్యం తదితర శాఖలు సీఎం రంగసామి వద్ద ఉన్నాయి.

మధ్యవర్తిత్వంతో

కోర్టు కేసుల పరిష్కారం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడానికి ఇరు పక్షాలు, వారి తరఫు న్యాయవాదులు ముందుకు రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్‌ అహ్మద్‌ మౌలానా పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యాన మీడియేషన్‌ 3.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలో బుధవారం నిర్వహించిన ర్యాలీ, వన్‌ కే వాక్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమైన కేసులపై మళ్లీ పైకోర్టుకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉండదని, దీంతో వివాదం శాశ్వతంగా పరిష్కారమవుతుందని వివరించారు. సివిల్‌ కోర్టుల్లో రాజీ కుదిరిన కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. గతంలో ఇరు పక్షాలు రాజీకి వచ్చినప్పుడు కేసులను లోక్‌ అదాలత్‌కు మాత్రమే పంపేవారని, ప్రస్తుతం కక్షిదారులు, న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపడం శుభపరిణామమని మౌలానా అన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు సివిల్‌ జడ్జి కె.రత్నప్రసాద్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్‌, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయవాదులు, శిక్షణ పొందిన మీడియేటర్లు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement