అయినవిల్లి: అధికారం అండతో టీడీపీ, జనసేన నాయకులు కొందరు అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, దీనివలన 400 ఎకరాల్లోని తమ వరి చేలకు ముప్పు వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వివరాలివీ.. మండలంలోని నేదునూరు కుమ్మరి కాలువ(మురుగు కోడు)ను ఆనుకుని పదెకరాల్లో చేపల చెరువుల తవ్వకానికి మత్స్యశాఖ అధికారులు గతంలో అనుమతి ఇచ్చారు. ఇదే అదునుగా కూటమి నేతలు మరో ఐదెకరాలకు పైగా చెరువులు తవ్వేస్తున్నారు. మంచినీటి చేపల చెరువులకు అనుమతి ఇవ్వగా ఉప్పునీటి రొయ్యల చెరువులు తవ్వుతున్నారని, ఉప్పునీటి బోర్లు వేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఉప్పునీటిలోనే రొయ్యల సాగు చేస్తారు. దీనివలన చుట్టుపక్కల భూములు కూడా ఉప్పుబారి, సాగుకు పనికిరాకుండా పోతాయని వారు వాపోతున్నారు. దీనిపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా అది వెకేట్ అవడంతో కూటమి నేతలు రొయ్యల చెరువులు తవ్వారని రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఈ 400 ఎకరాల భూముల నుంచి ఇక్కడి పంటబోదెల ద్వారానే ముంపు నీరు దిగాల్సి ఉంటుంది. ఈ సమస్యలపై కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వారు ఆశ్రయించారు. పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రెవెన్యూ, మత్స్య, భూగర్భ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు స్పందించి, తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. దీనిపై మత్స్యశాఖ ఏఈ లోవరాజును ‘సాక్షి’ వివరణ కోరగా.. చెరువులు తవ్వుతున్న వారికి నోటీసులు ఇస్తామని, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
21ఎఎంపీ102: నేదునూరు చెరువు వద్ద వేసిన ఉప్పునీటి బోరు
ఫ అక్రమంగా రొయ్యల చెరువు తవ్వకాలు
ఫ కూటమి నేతలపై రైతుల ఆరోపణ
ఫ 400 ఎకరాల వరి చేలకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన


