సాక్షి, అమలాపురం: ముంచెత్తేసే భారీ వర్షాలు కొన్నాళ్లుగా దాదాపు ఎక్కడా లేవు. అయినప్పటికీ గోదావరి మధ్య డెల్టా పంట కాలువ ఎగువన ఉన్న ఆత్రేయపురం మండలం లొల్ల, ఆత్రేయపురం, వాడపల్లి గ్రామాల్లో నాట్లు వేసిన వరి చేలు నిండా మునిగిపోతున్నాయి. వర్షాలు కురవకపోయినా ముంపు నీరు దిగే అవకాశం లేక ఈ దుస్థితి తలెత్తింది. రోజుల తరబడి నీట మునగడంతో నాట్లు కుళ్లిపోయి, రైతులు నష్టపోతున్నారు. కాలువల్లో అక్రమ వంతెనలు, గట్ల ఆక్రమణల వల్ల నీరు సక్రమంగా పారక పొలాల్లోకి చేరుతోంది. అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ హయాంలో మురుగు కాలువ ద్వారా నీరు దిగేందుకు పంట కాలువ మీద రెండుచోట్ల సైఫన్లు నిర్మించారు. వీటిని ఆధునీకరణ పేరుతో కొత్తగా రూ.2.90 కోట్లతో పునర్నిర్మించారు. విచిత్రంగా అవి కట్టిన తరువాత చేలు రెట్టింపు మునిగిపోతున్నాయి. ఈ ఏడాది వర్షాలు లేకపోయినా చేలు మునిగిపోవడం గమనార్హం.
దీనికి భిన్నంగా కాలువ దిగువన అమలాపురం, కొత్తపేట, ఉప్పలగుప్తం, అల్లవరం, ఐ.పోలవరం మండలాల్లో నారుమడులు ఎండిపోతున్నాయి. పంట కాలువలకు నీరు ఇస్తున్నా శివారు, మెరక ప్రాంతాలకు చేరడం లేదు. చంద్రబాబు పాలనలో నీటి యాజమాన్యం ఘోరంగా విఫలమవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కోనసీమ రైతులు అల్లాడిపోతున్నారు.
సాగునీటి నిర్వహణలో అధికారుల విఫలం చెందడంతో ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన కోనసీమ జిల్లాలో పొలాలు బీళ్లుగా మారే ప్రమాదముందని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. క్లోజర్ పనుల పేరుతో ఇటీవల నియోజకవర్గానికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల ఖర్చు చేసినా చేలకు నీరు అందడం లేదు. క్లోజర్ పనుల్లో అవినీతి, కాలువకు అడ్డంగా ఇష్టానుసారం నిర్మాణాల వల్లే ఈ దుస్థితి ఏర్పడింది.
నేడు
ప్రస్తుతం మధ్య డెల్టాకు 2,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పుడున్న ఆయకట్టును పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో వరి సాగు లక్ష్యం 1,13,052 ఎకరాలు. తూర్పు డెల్టా పరిధిలోని ఆలమూరు, రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో సాగు పోగా సుమారు 90 వేల ఎకరాల్లో మాత్రమే ఇప్పుడు సాగవుతోందని అంచనా. దీని ప్రకారం 33 డ్యూటీ (33 ఎకరాలకు ఒక క్యూసెక్కు) చొప్పున సాగునీరు ఇస్తున్నారు. సాధారణంగా డెల్టాలో దమ్ములు, నాట్లు వేసిన సమయంలోను, చేలు పాలు పోసుకుని గింజ గట్టిపడుతున్న దశలోను 100 డ్యూటీ చొప్పున నీరు ఇస్తారు. అటువంటిది ఇప్పుడు 33 డ్యూటీ చొప్పున మాత్రమే సాగు నీరు ఇస్తూండటంతో చేలు ఎండిపోతున్నాయి.
జలవనరుల శాఖ అధికారుల వైఫల్యం.. కూటమి నేతలకు ముందుచూపు లేకపోవడం, నీటిసంఘాల చేతకానితనం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఫ ఆత్రేయపురంలో ముంపులో వరి చేలు
ఫ అమలాపురం మండలంలో ఎండిపోతున్న పరిస్థితి
ఫ వానలు లేకున్నా ఎగువన మునక
ఫ కాలువకు నీరిచ్చినా దిగువన ఎండుతున్న నారు
ఫ నీటి యాజమాన్యంలో ప్రభుత్వం విఫలం
ఫ మండిపడుతున్న రైతులు
నాడు
2009–10లో రబీలో కేవలం 82 టీఎంసీల నీటితో మొత్తం సాగును గట్టెక్కించారు. అప్పుడు కూడా మధ్య డెల్టాకు కాటన్ బ్యారేజీ నుంచి అత్యధికంగా 1,400 క్యూసెక్కుల చొప్పున నీరందించేవారు. 2009 ఫిబ్రవరిలో చేలు పాలు పోసుకుంటున్న సమయంలో కాలువకు ఇచ్చిన నీరు 1,200 క్యూసెక్కులు మాత్రమే. కానీ, ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదు. మధ్య డెల్టాలో ఏకంగా 1.60 లక్షల ఎకరాల్లో రబీ పంట పండించారు.
నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికత, అప్పటి ఇరిగేషన్ అధికారుల ఉత్తమ నీటి యాజమాన్య విధానాలు, నీటి సంఘాల నిరంతర పర్యవేక్షణ దీనికి ప్రధాన కారణం.


