● ఛిద్రమైన రోడ్లు
● తూతూమంత్రంగా ప్యాచ్ వర్కులు
● వాహనచోదకులకు ఇబ్బందులు
● గుంతలు పూడ్చిన కొద్ది రోజులకే
మళ్లీ శిథిలం
సీటీఆర్‌ఐ: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు ఉంది నగరంలోని రోడ్ల పరిస్థితి. నగరంలోని రోడ్లు మరి అధ్వాన స్థితిలో ఉన్నాయి. రోడ్లపై గోతులతో నిండి ప్రమాదకరంగా మారాయి. ఈ రహదారులపై ప్రయాణించాలంటే ప్రమాదాలతో చెలగాటమాడటమేనని వాహనచోదకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పాలన మొదలై రెండేళ్లు పూర్తయింది. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని రోడ్లు అద్దంలా మెరిసేలా తయారు చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క రోడ్డుకు కూడా మోక్షం కలగలేదు. నగర ఎమ్మెల్యే శంకుస్థాపనలతోనే సరిపెట్టడంతో నగరంలో అసలు రోడ్లకి మోక్షం కలుగుతుందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
నాణ్యత లేని ప్యాచ్ వర్కులతో సరి
నగరంలో రోడ్ల దుస్థితిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అప్పటికప్పుడు రోడ్లపై ప్యాచ్ వర్కులు చేయాలని నిర్ణయించారు. కొన్ని చోట్ల రోడ్లపై గుంతలను పూడ్చడానికి అక్కడక్కడ ప్యాచ్ వర్కులు చేశారు. కానీ నాణ్యత లేకపోవడంతో మళ్లీ శిథిలావస్థకు చేరుకున్నాయి. అసలు పూర్తి స్థాయిలో రోడ్లు ఎప్పుడు నిర్మిస్తారో తెలియక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగరంలో పలు చోట్ల తాత్కాలికంగా గుంతలను పూడ్చడానికి ప్యాచ్ వర్కులు చేశారు. స్థానిక వైజంక్షన్ నుంచి నందం గనిరాజు జంక్షన్ వరకు, బైపాస్ రోడ్డు నుంచి తాడితోట సెంటర్ వరకు, క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలాచెరువు సెంటర్ వరకు, టీటీడీ రోడ్డు, కంబాలచెరువు జంక్షన్, పేపర్‌మిల్లు రోడ్డు, సీతంపేట, ఆర్యాపురం, వీరభద్రపురం, ఆనంద్‌నగర్ వంటి పలు రద్దీ ప్రాంతాల్లో ప్యాచ్ వర్కులు చేశారు. కానీ ఈ ప్యాచ్ వర్కులు ఇప్పుడు చాలా ప్రమాదకరంగా మారాయి. పాత రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడానికి అక్కడ తారు వేసి ప్యాచ్ వర్కులు చేశారు. పాత రోడ్డు కంటే అదనంగా అరడుగు మందంలో కొత్తగా ప్యాచ్ వర్క్ చేయడంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనచోదకులు ప్రయాణించేటప్పుడు పాత రోడ్డు నుంచి గుంతలు పూడ్చిన వైపునకు బైక్ నడపడంతో టైర్ స్కిడ్ అయి ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా నిర్దిష్ట ప్రమాణంలో కాకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లు పూడ్చడంతో వాహనచోదకులు నానాఅగచాట్లు పడుతున్నారు.
బోల్తా కొట్టిన ఆటో
క్వారీ మార్కెట్ నుంచి లాలాచెరువు వెళ్లే రోడ్డులో దుర్గమ్మ గుడి వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి ఉంది. ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ గొయ్యిలో పడి ప్రమాదాల బారిన పడటంతో ఆ గొయ్యిలో మట్టి కప్పి తాత్కాలికంగా గొయ్యి పూడ్చారు. కానీ మొన్న కురిసిన వర్షాలకి మట్టి కొట్టుకుపోయి గోతిలో నీళ్లు నిండిపోయాయి. సుబ్బారావునగర్‌కి చెందిన దడాల సత్తయ్య ఆటో ప్రయాణం చేస్తుండగా ఆ గోతిలో పడి ఆటో బోల్తా పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆటో డ్రైవర్‌తో పాటు, ప్రయాణికుడు సత్తయ్యకి తీవ్ర గాయాలయ్యాయి. సత్తయ్యకి కాలు ఆటోకింద పడిపోవడంతో అతని కాలు విరిగింది. దీంతో పనులు చేసుకోలేక కుటంబంతో నానా ఇబ్బందులు పడుతున్నాడు.


