అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకూ మెగా తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల సమావేశం 4.0 నిర్వహించనున్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ విషయం తెలిపారు. జిల్లాలోని 1,409 విద్యా సంస్థల్లో చదువుతున్న 76,132 మంది విద్యార్థుల తల్లిదండ్రులిద్దరూ తప్పనిసరిగా ఆయా పాఠశాలల్లో జరిగే సమావేశాలకు హాజరు కావాలని కోరారు. విద్యార్థుల చదువు పురోగతి, ఫలితాలు, ప్రభుత్వ పథకాల అమలు, పాఠశాల అభివృద్ధి పనుల గురించి వివరించనున్నామన్నారు. విద్యార్థులకు సమగ్ర పురోగతి నివేదికలు ఇవ్వడంతో పాటు లీప్ యాప్ వాడకంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. సమావేశాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు పాల్గొంటారని వివరించారు. విలేకర్ల సమావేశంలో జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త జి.మమ్మీ, జిల్లా విద్యా శాఖ అధికారి వి.నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.
సబ్ స్టేషన్ నిర్మాణం
సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: జిల్లాలో చేపడుతున్న 400/132 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం, 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఏపీ ట్రాన్స్‌కో అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్షించారు. కొత్తపేట నుంచి అయినవిల్లి వరకూ 22 కిలోమీటర్ల మేర 400 కేవీ లైన్ పనులు జరుగుతున్నాయన్నారు. మొత్తం 64 టవర్లలో 62 పూర్తయ్యాయని, మిగిలినవి, వైర్లు బిగించే పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో కొత్తపేట ఆర్‌డీఓ సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఈఈలు పుల్లయ్య, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
హైవే పనులపై కలెక్టర్ ఆగ్రహం
అమలాపురం రూరల్: జిల్లాలో జాతీయ రహదారి–216 విస్తరణ, జొన్నాడ ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణ పనుల్లో జాప్యంపై కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో జాప్యం చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హైవే అధికారులను హెచ్చరించారు. ఈ పనులపై హైవే, ఏపీ ట్రాన్స్‌కో అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్షించారు. జిల్లాలో ఎన్‌హెచ్–216 విస్తరణలో భాగంగా 132 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్ల తరలింపు పనులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ఈఈని ఆదేశించారు. అనంతరం జొన్నాడ ఫ్లై ఓవర్ పనులపై ఎన్‌హెచ్ ఏఈ శృతి, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశమయ్యారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ వద్దని స్పష్టం చేశారు. సర్వీస్ రోడ్డు టెండర్లు పూర్తయ్యాయని, ఆగస్టులో కాంట్రాక్టర్లతో సమీక్షించి నవంబరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. యంత్రాలు, సిబ్బందిని పెంచి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్‌డీఓ సరళావతి తదితరులు పాల్గొన్నారు.


