అమలాపురం టౌన్: జిల్లాలోని 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెన్‌డౌన్ నిరసనలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి, అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. రిజిస్ట్రేషన్లను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని, ఇందుకోసం విడుదల చేసిన జీఓ–396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాయాల ద్వారా నాలుగో రోజు కూడా ప్రభుత్వం రూ.10 కోట్లు పైగా ఆదాయం కోల్పోయింది. మొత్తం నాలుగు రోజుల్లోనూ దాదాపు రూ.50 కోట్ల వరకూ రాబడికి బ్రేక్ పడింది. కక్షిదారులకు దస్తావేజు లేఖర్లు డాక్యుమెంట్లు రాసి ఇస్తే, వాటిపై అధికారులు రాజముద్ర వేసి అధికారికంగా జారీ చేస్తారు. దస్తావేజు లేఖర్ల నిరసనలతో కక్షిదారులకు రిజిస్ట్రేషన్ సేవలు అందడం లేదు. అమలాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద లేఖర్లు, సహాయకులు, టైపిస్టులు చేపట్టిన నిరసనలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి సురేష్, గౌరవాధ్యక్షుడు గుంటు ఫణి ప్రసాద్, కన్వీనర్ మట్టపర్తి రాము, కార్యదర్శి పందిరి శ్రీహరి రామ్‌గోపాల్, సంయుక్త కార్యదర్శులు వెలుతురుపల్లి సుబ్బు, గనిశెట్టి భోగిరాజు తదితరులు పాల్గొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేశారు.


