అమలాపురం టీడీపీలో.. | - | Sakshi
Sakshi News home page

అమలాపురం టీడీపీలో..

Jul 24 2026 12:40 AM | Updated on Jul 24 2026 12:40 AM

శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

జిల్లా కేంద్రంలో రసవత్తర రాజకీయం

‘నామినేటెడ్‌’ కోసం అడుగడుగునా ఆరాటం

‘స్థానిక’ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంతో ముదిరిన ఆధిపత్య పోరు

కొత్త రక్తం పేరుతో పాత వారిని పక్కన పెడుతున్న లోకేష్‌

ముక్కలాట

3

సాక్షి, అమలాపురం: అమలాపురం టీడీపీలో మూడు ముక్కలాట మొదలైంది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ సాగుతున్న ఆధిపత్య పోరు.. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ జిల్లాలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ తర్వాత పరాకాష్టకు చేరింది. సీనియర్‌ నాయకుడు మెట్ల రమణబాబు, ఇటీవల పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న గంధం పల్లంరాజు, లోకేష్‌ వర్గంగా చెప్పుకుంటున్న చెరుకూరి సాయిరామ్‌ల మధ్య సాగుతున్న పోరు టీడీపీ క్యాడర్‌కు తలనొప్పిగా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకురావడంతో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు ముదిరింది. నామినేటెడ్‌ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత నియామకాలు, స్థానిక వ్యవహారాల్లో ప్రాధాన్యం దక్కించుకునే ప్రయత్నాల్లో మూడు వర్గాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా అమలాపురం మున్సిపాలిటీలో తమ హవా చాటుకోవాలని, ఎక్కువ సీట్లు సాధించాలని ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. పార్టీ అధిష్టానం యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తూండటంతో స్థానిక సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కొత్త రక్తం పేరుతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేష్‌ తమను పార్టీ, ప్రభుత్వ పదవులకు దూరంగా ఉంచుతున్న తీరును సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘మెట్ల’కు ఉక్కపోత

పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబుకు సొంత పట్టణం అమలాపురంలోనే ఉక్కపోత ఎదురవుతోంది. మాజీ మంత్రి డాక్టర్‌ మెట్ల సత్యనారాయణరావు రాజకీయ వారసుడైన రమణబాబుకు 2014–19లోను, తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నామినేటెడ్‌ పదవుల్లో న్యాయం జరగలేదని ఆయన వర్గం అసంతృప్తితో ఉంది. తొలుత ఆప్కాబ్‌ చైర్మన్‌, తర్వాత జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ పదవి ఆశించినా దక్కలేదు. కార్పొరేషన్ల కేటాయింపులోనూ మొండిచేయి చూపారు. దీంతో, ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అది కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కుటుంబంలో మూడో తరానికి చెందిన మెట్ల సత్యనారాయణరావు(సత్య)ను మున్సిపల్‌ చైర్మన్‌ చేయాలని ఆ వర్గం ఆశిస్తోంది. అయితే, ఆ పదవిని జనసేనకు ఇవ్వనున్నట్లు సమాచారం. నామినేటెడ్‌ పదవుల కేటాయింపుల్లో, పార్టీ కార్యక్రమాల నిర్వహణలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అసంతృప్తి రమణబాబులో వ్యక్తమవుతోంది.

X

పల్లంరాజు ఆధిపత్య ప్రదర్శన

మరోవైపు పార్టీ జిల్లా కార్యదర్శి గంధం పల్లంరాజు తన వర్గాన్ని బలోపేతం చేసుకుంటూ జిల్లా కేంద్రంలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ కోనసీమలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా రాజకీయాలతో సంబంధం లేకపోయినా, ఆయన తన వర్గాన్ని పోగు చేసి నిర్వహించిన ఈ ర్యాలీ కొత్త వివాదాలకు దారి తీసింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, అయితాబత్తుల ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, మంత్రి వాసంశెట్టి సుభాష్‌ పాల్గొన్నప్పటికీ వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. చివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయిని కూడా పక్కన పెట్టి పల్లంరాజు వ్యవహరిస్తూండడం టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోస్తోంది.

ఇక రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరామ్‌ కూడా తనదైన శైలిలో పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అమలాపురంలో తనకు ప్రత్యేక వర్గం లేకపోయినా లోకేష్‌ ఆశీస్సులున్నాయనే సంకేతాలిస్తూ ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో పార్టీలో కీలక బాధ్యతలు లేదా నామినేటెడ్‌ పదవి తనకే దక్కుతుందని ఆయన అనుచరులు ధీమాగా ప్రచారం చేస్తున్నారు. బయటకు అందరూ ఐక్యత ప్రదర్శిస్తున్నా, తెర వెనుక ప్రతి నిర్ణయంపై ఈ మూడు వర్గాల మధ్య పోటీ కొనసాగుతోంది. ఈ అంతర్గత ఆధిపత్య పోరు అమలాపురం రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement