ఆదర్శంగా నిలుస్తున్న నర్సరీ రైతు
మామిడికుదురు: చుట్టూ ఆక్వా చెరువులు.. ఎటు చూసినా రొయ్యలు, చేపల సాగు. అలాంటి చోట సున్నితమైన మొక్కల పెంపకమా? సాధ్యం కాదంటూ కొందరు పెదవి విరిచారు. కానీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా ముందడుగు వేశారు. తలపెట్టిన కార్యాన్ని రెండేళ్లలోనే సాకారం చేసి లూటుకుర్రు గ్రామాన్ని నర్సరీ పటంలో నిలబెట్టారు. ఆయన పేరు బోనం సత్తిరాజు. చదివింది పదో తరగతే అయినా మొక్కల పెంపకంపై ఉన్న మక్కువ, అనుభవం నర్సరీ రంగంలో రాణించేలా చేశాయి. ఇప్పటికే కడియం, అనంతపురం జిల్లాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం లూటుకుర్రులో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నర్సరీని ప్రారంభించారు. ఆక్వా చెరువుల మధ్య మొక్కల పెంపకం కత్తి మీద సామే అయినా, ప్రత్యేక శ్రద్ధతో అనుకూల వాతావరణాన్ని సృష్టించి అద్భుత ఫలితాలు సాధించారు. ఇక్కడి మొక్కలు ప్రస్తుతం ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుండటం విశేషం. వ్యాపారమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ ఎందరికో నిలుస్తున్నారు సత్తిరాజు.
స్వగ్రామంలో ఉపాధి కల్పనే లక్ష్యం
నా సొంత ఊరు లూటుకుర్రులో నర్సరీ పెట్టి ఇక్కడి యువతకు ఉపాధి చూపించాలనేది నా బలమైన కోరిక. చుట్టూ ఆక్వా చెరువులు ఉండటంతో ఇక్కడ మొక్కలు బతకవని చాలామంది చెప్పారు. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదని నమ్మాను. శాస్త్ర సాంకేతిక పద్ధతులు, సరైన యాజమాన్య విధానాలు పాటించి రెండేళ్లలోనే ఆశించిన ఫలితాలు సాధించాం. ఈ రోజు మన ఊరి మొక్కలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంటే చాలా గర్వంగా ఉంది.
– బోణం సత్తిరాజు, లూటుకుర్రు


