సమర్థంగా భూ పరిపాలన సంస్కరణల అమలు | - | Sakshi
Sakshi News home page

సమర్థంగా భూ పరిపాలన సంస్కరణల అమలు

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

సాక్షి, అమలాపురం: భూ పరిపాలన సంస్కరణలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ వైఖోమ్‌ నైదియాదేవి ఆదేశించారు. కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో రాష్ట్ర సచివాలయం నుంచి భూ పరిపాలన ముఖ్య కమిషనర్‌ జి.జయలక్ష్మి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ, 22–ఎ కేసులను, రీ సర్వే అర్జీలను త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఐదో దశ గ్రౌండ్‌ ట్రూతింగ్‌, ఈ–కేవైసీ రిపోర్టులు, నెలవారీ ప్రగతి నివేదికలపై చర్చించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ వి.సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్‌ అచ్యుత కుమారి, సర్వే ల్యాండ్స్‌ రికార్డ్స్‌ ఏడీ కె.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘తూర్పు’ డ్వామా ఏపీడీగా

ఎంపీడీఓ నరేష్‌ కుమార్‌

కొత్తపేట: స్థానిక ఎంపీడీఓ పీఎస్‌ నరేష్‌ కుమార్‌కు డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (డీఎల్‌డీఓ) పోస్టింగ్‌ను రద్దు చేసి, డ్వామా ఏపీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో ఆయనకు డీడీఓగా ఉద్యోగోన్నతి కల్పించి, పోలవరం జిల్లా చింతూరు డీఎల్‌డీఓగా నియమించింది. ప్రతి అధికారీ విధిగా ఏజెన్సీ ప్రాంతంలో పని చేయాలనే నిబంధన ఉంది. నరేష్‌ కుమార్‌ గతంలో ఎటపాక ఎంపీడీఓగా పని చేయడంతో పాటు దేవీపట్నం మండలానికి అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా చింతూరు డీఎల్‌డీఓ పోస్టింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసి, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్లస్టర్‌ డ్వామా ఏపీడీగా నియమించింది. ఈ మేరకు ఆయన మంగళవారం కొత్తపేట ఎంపీడీఓ బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. రాజమహేంద్రవ రంలో డ్వామా ఏపీడీగా బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్టు నరేష్‌ కుమార్‌ తెలిపారు.

రెగ్యులర్‌ ఆర్‌డీఓగా ధర్మరాజు

అమలాపురం టౌన్‌: దాదాపు ఆరు నెలలుగా అమలాపురం ఆర్‌డీఓగా ఇద్దరు అధికారులు ఒకరి తర్వాత ఒకరు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనికి తెర దించుతూ డి.ధర్మరాజు రెగ్యులర్‌ ఆర్‌డీఓగా రానున్నారు. ప్రస్తుతం ఆయన పార్వతీపురం మన్యం జిల్లా కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. తాజాగా అమలాపురం ఆర్‌డీఓగా బదిలీ అయ్యారు. రెండు మూడు రోజుల్లో ధర్మరాజు అమలాపురం ఆర్‌డీఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక్కడ గతంలో కొత్త మాధవి రెగ్యులర్‌ ఆర్‌డీఓగా పని చేశారు. ఆమె బదిలీ అనంతరం జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్‌ కో ఆర్డినేటర్‌ జి.మమ్మీ ఇన్‌చార్జి ఆర్‌డీఓగా నియమితులయ్యారు. అనంతరం, రామచంద్రపురం ఆర్‌డీఓ సరళావతి అమలాపురం ఇన్‌చార్జి ఆర్‌డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఇన్‌చార్జిలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఎట్టకేలకు అమలాపురం రెగ్యులర్‌ ఆర్‌డీఓగా ధర్మరాజును నియమించారు.

6 కిలోల వెండి వస్తువుల అపహరణ

తాళ్లరేవు: మండల కేంద్రమైన తాళ్లరేవు మార్కెట్‌ వీధిలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వ్యాపారి అద్దేపల్లి సురేష్‌ తన కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్లారు. ఆ సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంటి వెనుక వైపు తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. పూజ గదిలోని దేవుడి సామగ్రిని చిందరవందర చేశారు. బెడ్‌ రూములోని బీరువాను బద్దలుగొట్టి అందులో ఉన్న సుమారు 6 కిలోల వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుందని బాధితులు తెలిపారు. సినిమా చూసి ఇంటికి వచ్చిన సురేష్‌, కుటుంబ సభ్యులు చోరీ జరిగిన విషయం గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోరంగి ఎస్సై సత్యనారాయణ బృందం ఆ ఇంటిని పరిశీలించింది. క్లూస్‌ టీం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఈ చోరీతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

రేపు జాబ్‌ మేళా

సాక్షి, అమలాపురం: వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అమలాపురంలో బుధవారం జాబ్‌ మేళా నిర్వహిస్తున్నారు. జిల్లా ఉపాధి అధికారి ఆర్‌.వహీదా మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళా కు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు బయోడే టా, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, జిరాక్స్‌ కాపీలు, పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలతో ఆ రోజు ఉదయం 10 గంటలకే జిల్లా ఉపాధి కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. వివరాలకు 89789 05032 నంబర్‌లో సంప్రదించాలని వహీదా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement