ఆలమూరు: తొలకరి వరి సాగు జిల్లా రైతుకు శరాఘాతంగా మారింది. ఓవైపు ఎల్‌నినో ప్రభావంతో ఇటు వర్షాలు లేక, ప్రభుత్వం సాగునీరు సక్రమంగా అందించక గతంలో ఎన్నడూ లేనివిధంగా ఖరీఫ్‌లోనే నారుమడులు, పచ్చని పొలాలు ఎండిపోతున్న దుస్థితి. మరోవైపు ఎరువుల పంపిణీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నూతన విధానం రైతులకు తలనొప్పిగా మారింది. మునుపెన్నడూ లేని విధంగా రేషన్ పద్ధతిలో ఎరువులు పంపిణీ చేయడంతో రైతులు నానా హైరానా పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 1.29 లక్షల ఎకరాల్లో సుమారు 90 వేల మంది రైతులు ఖరీఫ్ వరి సాగు చేస్తున్నారు. ఎక్కువ మంది ఎంటీయూ–1318, ఎంటీయూ–1153, 1156, స్వర్ణ వంటి రకాలు సాగు చేస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం అన్ని రకాలూ కలిపి జిల్లాకు 16 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. ప్రభుత్వం సాగునీరు అందించకపోవడంతో ఇప్పటికీ కొన్నిచోట్ల నారుమళ్లు కూడా పడని పరిస్థితి. మరోవైపు నీరు అందుతున్న ప్రాంతాల్లో నారుమళ్లు, నాట్ల దశలో వరి సాగు ఉంది. ఈ తరుణంలో పంటకు ఎరువులు అవసరమని రైతులు చెబుతున్నారు. అయితే, ఈ ఏడాది నుంచి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏఐఎంఎస్ – ఎయిమ్స్) యాప్ రైతులకు ఇబ్బందికరంగా మారింది.
రేషన్ పద్ధతిలో..
మునుపెన్నడూ లేని విధంగా భూమిని బట్టి రేషన్ పద్ధతిలో కేజీల లెక్కల్లోనే ఎరువులు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాప్ ద్వారా రైతుకు ఎకరాకు యూరియా 90 కేజీలు (రెండు బస్తాలు), డీఏపీ 25 కేజీలు (అర బస్తా) మాత్రమే, అది కూడా మూడు విడతల్లో ఇవ్వాలని నిర్దేశించింది. రైతుకు 60 సెంట్ల భూమి ఉంటే 54 కేజీల యూరియా మాత్రమే ఇస్తారు. అదే రెండెకరాలు పైబడితే డీఏపీ అరబస్తా ఇస్తారు. ఎకరంలోపు ఉన్న రైతుకు డీఏపీ ఇవ్వబోమని వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం చెప్పిస్తోంది. నారుమడి సమయంలోనే ఎరువుల కోసం ఇన్ని ఇబ్బందులు ఎదురవుతూంటే పైరు ఎదిగే సమయంలో మరెన్ని కష్టాలు చూడాల్సి వస్తుందేమోనని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో విసిగిపోతున్న వారు.. కాంప్లెక్స్ ఎరువులను అధిక ధరలకు కొనుగోలు చేసి, సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యాప్‌సోపాలు
గతంలో రైతులు ఎరువుల దుకాణం లేదా సొసైటీ వద్దకు వెళ్లి తమకు కావాల్సిన ఎరువులు కొనుగోలు చేసుకుని, పంటకు వేసేవారు. కానీ, యూరియా, డీఏపీ వంటి ఎరువులపై ఇస్తున్న రాయితీల భారాన్ని తగ్గించుకునే లక్ష్యంతో కేంద్ర ఈ యాప్‌ను అమలులోకి తెచ్చింది. ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకేనని చెబుతోంది. ఈ యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ పేరుతో అమలు చేస్తోంది. దీంతో, రైతులు ఈ యాప్ ద్వారానే ఎరువులు పొందాల్సి వస్తోంది. దీనికోసం వారు తప్పనిసరిగా ఈ–కేవైసీ చేయించుకోవాలి. యాప్‌లో వివరాలన్నీ పొందుపరచాలి. తరువాతే సంబంధిత ఎరువులు పంపిణీ చేస్తున్నారు. కౌలు రైతులకై తే కౌలు గుర్తింపు కార్డులు లేదా భూ యజమాని అంగీకారం తప్పనిసరి చేసింది. దీంతో, ఈ–కేవైసీ చేయించుకున్న రైతులు తమకు కావాల్సిన ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. యాప్‌పై అవగాహన, సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులు ఎరువుల కోసం ఆపసోపాలు పడుతున్నారు.
ఫ ఎరువుల కోసం రైతుల హైరానా
ఫ యాప్‌తో సమయం వృథా
ఫ కేజీల లెక్కలో విక్రయాలపై అసంతృప్తి
పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఎటువంటి నిబంధనలు, యాప్‌తో సంబంధం లేకుండా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలి. రేషన్ పద్ధతిలో ఎరువులు పంపిణీ చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు దఫాలుగా ఎరువులు ఇవ్వడం వల్ల రైతుల సమయం వృథా అవుతోంది.
– అడపా వీర్రాజు (పెదబాబు),
పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు,
సంధిపూడి, ఆలమూరు మండలం
కష్టంగా ఉంది
యాప్ ద్వారా ఎరువులు పొందడం చాలా కష్టంగా ఉంది. ఎరువుల కోసం పొలం పనులు మానుకుని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరగాలంటే ఇబ్బందే. ఒక్కోసారి సర్వర్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
– నెక్కంటి సూర్యప్రకాశరావు,
రైతు,
పెదపళ్ల,
ఆలమూరు మండలం
వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకే..
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకే రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నాం. ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా ఎరువుల దుర్వినియోగాన్ని అరికట్టి అర్హులైన రైతులందరికీ అందజేస్తున్నాం. రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే సత్వరమే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలి.
– ఎంవీ రామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి,
అమలాపురం


