అమలాపురం టౌన్: గత విద్యా సంవత్సరం జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 136 మంది విద్యార్థులను షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యా శాఖ సత్కరించనుంది. కలెక్టరేట్ సమీపంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో కలెక్టర్ మహేష్ కుమార్ ఒక్కో విద్యార్థికి పతకం, ప్రశంసా పత్రంతో పాటు రూ.20 వేల నగదు బహుమతి అందించనున్నారు. డీఈఓ పి.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. గత విద్యా సంవత్సరం వరకూ కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే ఈ పురస్కారాలు అందించేవారు. ఈ ఏడాది నుంచి తొలిసారిగా ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా వీటిని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 64, ప్రైవేటు పాఠశాలల నుంచి 72 మంది చొప్పున విద్యార్థులకు ఈ పురస్కారాలు అందించనున్నారు. మొత్తం 47 మంది ఓసీ, 47 మంది బీసీ, 21 మంది ఎస్సీ, 18 మంది ఎస్టీ, ముగ్గురు సీడబ్ల్యూఎస్‌ఎన్ విభాగాల్లో ఈ విద్యార్థులను ఎంపిక చేశారు. వీరితో పాటు ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధించిన 30 మంది విద్యార్థులకు కూడా షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు.
నేడు పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) – మీకోసం, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్‌లో యథావిధిగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నమోదైన అర్జీల ప్రస్తుత స్థితి, ఇతర వివరాలను 1100 టోల్ ఫ్రీ నంబరుకు నేరుగా కాల్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
ట్రీక్కుల మారి..
ఆత్రేయపురం: అధికారం తమదే అని అధికార పార్టీకి చెందిన నేత మండలంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అతను ఏం అధికారులు చూసిచూడనట్లుగా అసలు పట్టించుకోవట్లేదు. బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారిపై గతంలో ప్రభుత్వం సోషల్ ఫారెస్ట్రీ ద్వారా పెంచిన చెట్లను అధికార పార్టీ నేత ఆదివారం భారీ యంత్రాల సాయంతో పట్టపగలు నరికివేస్తున్నప్పటికీ అధికారులు ఏమి పట్టించుకోలేదు. గతంలో కూడా అతడు తన వ్యాపారానికి అడ్డొస్తుందనే నెపంతో కొన్ని భారీ చెట్లను తొలగించారని స్థానికులు అంటున్నారు. ఇంత చేస్తున్నా అతనిపై ఎందుకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.


