రావులపాలెం: కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో అనుసంధానం చేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ రూపొందించిన జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శనివారం ఆవిష్కరించారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ యాప్‌ను రూపొందించారన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నిరంతరాయంగా నీటి సరఫరా
అధికారులకు కలెక్టర్ ఆదేశం
అమలాపురం రూరల్: ఖరీఫ్ నేపథ్యంలో రైతులకు సాగునీరు, ప్రజలకు సురక్షిత తాగునీరు నిరంతరాయంగా అందేలా అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. వ్యవసాయ, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫ రా అధికారులు, నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి కాలువలు, డ్రెయిన్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్రమణలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. రానున్న రెండు రోజుల్లో తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ ఏఈలు, నీటి సంఘాల అధ్యక్షులు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి, సంయుక్త ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే బిల్లులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇరిగేషన్ ఆస్తులపై ఇతర శాఖలు చేపట్టే పనులను ఆర్‌డీఓ ఆధ్వర్యంలోని సమన్వయ కమిటీ ఆమోదించిన తర్వాతే ప్రారంభించాలని సూచించారు. కాలువలు, డ్రెయి న్లపై ఆక్రమణలను గుర్తించి, 15 రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని, ఆక్రమణదారులకు చట్టపరమైన నోటీసులు జారీ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మలికిపురం, శంకరగుప్తం ప్రాంతాల్లో గుర్తించిన సుమారు 600 ఎకరాల ఆక్రమణలపై తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


