అమలాపురం రూరల్: సాగునీటి ప్రభుత్వ నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 14,200 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. ఆ నీరు శివారు ప్రాంతాలకు ఎందుకు చేరలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వేసవిలో కాలువల నిర్వహణ, పూడికలు, అడ్డంకుల తొలగింపు వంటి పనులను ప్రభుత్వం చేయనందువల్లనే ఖరీఫ్‌లో నీరు లేక నారుమళ్లు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మండలంలోని చిందాడ గరువులో నీరు లేక ఎండిపోయిన నారుమళ్లను పార్టీ నాయకులతో కలసి ఆయన శనివారం పరిశీలించారు. ఎండిన పంటబోదెలు, బీడుగా మరిన నారుమళ్లలో రైతులతో కలిసి నిరసన తెలిపారు. రైతు మట్టా సువర్ణరాజుకు చెందిన ఆకుమడిని పరిశీలించి, ఆయన కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ నాలుగుసార్లు నారుమళ్లు వేసి, నష్టపోయానని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
శాఖలో ఏం జరుగుతోందో మంత్రికే తెలీదా!
ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, రైతులు సొంత డబ్బుతో పాటు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ నారుమళ్లు వేసి, ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారని, కానీ ప్రభుత్వం అదునుకు సాగునీరు అందించకపోవడంతో వారి పెట్టుబడులు మొత్తం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు స్వయంగా కలెక్టర్‌ను కలసి, సాగునీరివ్వాలని వేడుకున్నా స్పందించలేదని విమర్శించారు. జలవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చివరి ఆయకట్టులోని పంటలు ఎలా ఎండిపోతున్నాయో పరిశీలించకుండా ప్రచార కార్యక్రమాలతో సరిపెట్టడం రైతులను అవమానించడమేనని అన్నారు. కాలువల్లో పనులకు ఎవరు అనుమతిచ్చారని మంత్రే స్వయంగా ప్రశ్నించడం చూస్తే తన శాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మే నెలలోనే అధికారులు అప్రమత్తమై కాలువల్లో మట్టి, అడ్డంకులు తొలగించి ఉంటే ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో సైఫన్ నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా సరైన ప్రణాళిక లేక, అవినీతి కారణంగా ఒకచోట నీరు నిలిచి, మరోచోట చివరి ఆయకట్టుకు చేరకపోవడం బాధాకరమని అన్నారు.
వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) మాట్లాడుతూ, ఈ అంశంపై తాము ఎలాంటి రాజకీయాలూ చేయడం లేదని, రైతుల ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఖరీఫ్‌లో గడచిన 60 సంవత్సరాల్లో వర్షాలకు మునిగి నారుమళ్లు దెబ్బ తిన్నాయి కానీ, కూటమి ప్రభుత్వ వైఫల్యంతో నీరందక నారుమళ్లు ఎండిబోవడం ఇదే తొలిసారని అన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ అమలాపురం, రాజోలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు డాక్టర్ పినిపే శ్రీకాంత్, పాముల రాజేశ్వరీదేవి కూడా మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ నేతలు పితాని బాలకృష్ణ, కాశీ మునికుమారి, కుడుపూడి భరత్ భూషణం, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య కుమార్, కర్రి నాగిరెడ్డి, ఇందుకుకూరి శ్రీనివాసరాజు, వంగా గిరిజా కుమారి, సంసాని నాని, సలాది సతీష్, గుమాళ్ల సురేష్, కాశీ రామకృష్ణ, మాజీ సర్పంచ్ పొనకాల గణేష్, శీలం సాయిరామ్, రాయపరెడ్డి నాగు, శీలం సూరిబాబు, రాజులపూడి మురళీకృష్ణ, రంకిరెడ్డి శంకరం, గుమాళ్ల పెదబాబీ, మాదిరెడ్డి లోవరాజు, నిమ్మకాయల హనుమంతు శ్రీనివాస్, పోలమారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
14,200 క్యూసెక్కులు విడుదల చేస్తే ఆ నీరు శివారుకు ఎందుకు చేరలేదు?
వైఎస్సార్ సీపీ నేతల సూటిప్రశ్న
చిందాడగరువులో
ఎండిన నారుమళ్ల పరిశీలన


