యమపాశాలై.. | - | Sakshi
Sakshi News home page

యమపాశాలై..

Jul 20 2026 12:32 AM | Updated on Jul 20 2026 12:32 AM

ఎగసిన అలలే..

అల్లవరం/అంబాజీపేట: ఇటీవల జరిగిన వివాహ వేడుకలో వారందరూ ఎంతో ఆనందంగా గడిపారు. తమతమ ఇళ్లకు వెళ్లే ముందు సరదాగా ఎంజాయ్‌ చేద్దామని బీచ్‌కు వెళ్లారు. అక్కడ మృత్యుపాశాల్లా ఎగసిపడిన కడలి అలలు ఇద్దరి ప్రాణాలను బలి తీసుకున్నాయి. అపార జలరాశిలో మరొకరి ఆచూకీ గల్లంతైంది. ఓడలరేవు బీచ్‌లో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

అప్పటి వరకూ ఆనందంగా గడిపి..

కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన సూదా అరవింద్‌ (23) సోదరి సత్యకు, మామిడికుదురు మండలానికి చెందిన దొడ్డా ఫణికృష్ణకు ఇటీవల వివాహం జరిగింది. వీరు అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఈ నేపథ్యంలో మంచాల షణ్ముఖ్‌ (17), కొర్లపాటివారిపాలేనికి చెందిన మంచాల సాయి(22)తో పాటు మంచాల జ్ఞానేశ్వర్‌, మంచాల ప్రేమ్‌చంద్‌, మంచాల హర్షిత, మంచాల ప్రేమ్‌సాయి సరదాగా గడపాలని ఓడలరేవు బీచ్‌కు ఆదివారం మధ్యాహ్నం వచ్చారు. ఒకే బంధువర్గానికి చెందిన వీరందరూ తొలుత అమలాపురంలోని ఓ రెస్టారెంట్‌లో భోజనం ముగించుకుని మోటార్‌ సైకిళ్లపై బీచ్‌కు చేరుకున్నారు. ఓఎన్‌జీసీ టెర్మినల్‌ పశ్చిమ గేటుకు సమీపాన ఉన్న ఓఎన్‌జీసీ వెల్స్‌ వద్ద రెండు గ్రోయిన్ల మధ్య అరవింద్‌, షణ్ముఖ్‌, సాయి, జ్ఞానేశ్వర్‌, ప్రేమ్‌చంద్‌ కలసి ఉత్సాహంగా సముద్ర స్నానానికి దిగారు. సత్య, ఫణికృష్ణ, హర్షిత, ప్రేమ్‌సాయి ఒడ్డున ఉన్నారు.

గ్రోయిన్లతో గోతులు పడి..

ఉవ్వెత్తున ఎగసి పడుతున్న కెరటాలు గ్రోయిన్లకు బలంగా తాకుతూండటంతో ఆ గ్రోయిన్ల వద్ద అప్పటికే భారీ గోతులు ఏర్పడ్డాయి. స్నానానికి దిగిన ఐదుగురు యువకులకు ఆ విషయం తెలియలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎగసిపడిన బలమైన అలల ధాటికి ఆ ఐదుగురూ సముద్రంలోకి కొట్టుకుపోయారు. కెరటాల తాకిడికి అరవింద్‌, షణ్ముఖ్‌ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మంచాల సాయి ఆచూకీ గల్లంతైంది. జ్ఞానేశ్వర్‌, ప్రేమ్‌చంద్‌ ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. బీచ్‌ నుంచి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నామని, ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుందని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికి అందివచ్చిన చెట్టంత కొడుకులు సముద్రంలో మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉండగా, సాయి ఆచూకీ కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలిస్తున్నట్లు మైరెన్‌ సీఐ మూర్తి, అల్లవరం ఎస్సై సంతోష్‌ కుమార్‌ తెలిపారు. అరవింద్‌, షణ్ముఖ్‌ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఉన్నత స్థానానికి వెళతాడనుకుంటే..

ఈ సంఘటనలో మృతుడు సూదా అరవింద్‌ కొత్తపేట మండలం బిళ్లకుర్రు పోస్టాఫీసులో బీపీఎంగా పని చేస్తున్నాడు. అంబాజీపేట మండలం మాచవరంలోని తన మేనమామ మంచాల వెంకటేశ్వరరావు ఇంటి నుంచి ప్రతి రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తూండేవాడు. ఊహించని విధంగా అరవింద్‌ కడలి కెరటాలకు బలి కావడంతో అతడి సోదరి దొడ్డా సత్య కన్నీరుమున్నీయ్యారు. తన తండ్రికి కొడుకు అందివచ్చాడనే ఆనందం మిగలకుండానే తమ్ముడు అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆమె రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఆ కుటుంబానికి ఇక దిక్కెవరంటూ బంధువులు విలపించారు.

అప్రమత్తతే మమ్మల్ని కాపాడింది

అరవింద్‌, షణ్ముఖ్‌, సాయితో పాటుగా ప్రేమచంద్‌, నేను సముద్రంలో స్నానానికి దిగాం. గ్రోయిన్ల వద్ద లోతును గుర్తించలేకపోయాం. అందరం స్నానం చేస్తూండగా ఒక్కసారిగా వచ్చిన కెరటం వచ్చింది. అందరం ప్రమాదంలో పడ్డాం. నేను అప్రమత్తమయ్యాను. ప్రేమచంద్‌, నేను చెయ్యి చెయ్యీ పట్టుకుని మా ప్రాణాలను రక్షించుకున్నాం. సాయి కొట్టుకుని పోతూ కొంత దూరం వరకూ కనిపించాడు.

– జ్ఞానేశ్వర్‌

కోల్‌కతా నిట్‌లో చేరాల్సి ఉంది

మాచవరానికి చెందిన షణ్ముఖ్‌ (శ్రీరామ్‌) తండ్రి నాగబాబు హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో, తల్లి ఆర్‌బీఐలో ఏజీఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ పాసై కోల్‌కతా నిట్‌లో సీటు సాధించిన షణ్ముఖ్‌ త్వరలో ఆ సంస్థలో చేరాల్సి ఉంది. ఇంతలోనే వారి ఒక్కగానొక్క కొడుకు ఈ సంఘటనలో మృతి చెందాడనే వార్తను అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఉద్యోగంలో చేరుతాడనుకుంటే..

కొర్లపాటివారిపాలేనికి చెందిన మంచాల శేషు పెద్ద కుమారుడు సాయి బీటెక్‌ పాసయ్యాడు. ఇటీవలే హైదరాబాద్‌లో ఓల్టాస్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. రెండు మూడు రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఇంతలోనే తమ కుమారుడిని కడలి ఎక్కడికో తీసుకుపోయిందని సాయి తల్లిదండ్రులు వంశీ, శేషు రోదించారు. సత్యసాయిబాబా తన కుటుంబానికి అన్యాయం చేయడని, తన బిడ్డ క్షేమంగా తిరిగి వస్తాడని తల్లి వంశీ కన్నీటిపర్యంతమయ్యారు. సాయితో పాటు సముద్ర స్నానానికి దిగిన అతడి సోదరుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఫ ఇద్దరు యువకులను కబళించిన కడలి

ఫ కానరాని మరొకరి ఆచూకీ

ఫ ఓడలరేవు బీచ్‌లో విషాదం

ఫ క్షేమంగా బయటపడిన మరో ఇద్దరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement