అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 44 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ మహేంద్ర ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చి, వివిధ సమస్యలపై ఫిర్యాదులు అందించారు.
మహిళలపై దాడులను
ఖండిస్తూ నేడు నిరసన
అల్లవరం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని మాజీ ఎంపీ చింతా అనురాధ, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వంగా గిరజా కుమారి అన్నారు. గుంటూరు, బద్వేలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనలు మహిళల గౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. వీటికి నిరసనగా అమలాపురం ఈదరపల్లి వంతెన సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 10 గంటలకు నిరసన కార్యకమం చేపడుతున్నామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని కోరారు.
షైనింగ్ స్టార్లకు సత్కారం
అమలాపురం రూరల్: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించి, షైనింగ్ స్టార్లుగా ఎంపికై న విద్యార్థులను సోమవారం ఘనంగా సత్కరించారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. 136 మంది పదో తరగతి, 30 మంది ఇంటర్ విద్యార్థులకు పతకం, ప్రశంసాపత్రం, రూ.20 వేలు చొప్పున నగదు ప్రోత్సాహకం అందించారు.
దేవదాయ శాఖ నిధుల
మళ్లింపు దురదృష్టకరం
అల్లవరం: తల్లికి వందనం పథకం అమలు పేరిట వివిధ శాఖల నుంచి నిధులను మళ్లించడం అత్యంత బాధ్యతారాహిత్యమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. దేవదాయశాఖ నుంచి రూ. 26.03 కోట్లు విడుదల చేస్తూ పరిపాలన అనుమతులు ఇవ్వడం, బ్రాహ్మణ కార్పొరేషన్ పరిధిలోని తల్లికి వందనం లబ్ధిదారులకు చెల్లింపుల కోసం నిధులు వినియోగిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు లు జారీ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మిగతా శాఖల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ గణాంకాల ఆధారంగా 87.41 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 64.76 లక్షల మంది మాత్రమే తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో రెండో ఏడాది 22.65 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏడాదికి రూ.13,211.82 కోట్ల నిధులు అవసరం కాగా, రూ.10,120 కోట్లకే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ నెల 24 న తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయునున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పారదర్శకమైన ఆర్థిక నిర్వహణ చేపట్టాలని, ఇతర శాఖల నిధులు మళ్లించే విధానాన్ని మానుకోవాలని కోరారు.
సిటిజన్ క్యూఆర్ కోడ్‌లతో
పారదర్శక సేవలు
అమలాపురం రూరల్: జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ క్యూర్ కోడ్‌లను ప్రదర్శించాలని జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియా దేవి అన్నారు. కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ లో సేవలు పొందిన అనంతరం క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలను నమోదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ ఫీడ్‌బ్యాక్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 230 అర్జీలను ఆమె స్వీకరించారు.


