ఉపాధిపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఉపాధిపై వేటు

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

సాక్షి, అమలాపురం: ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ)ను చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే సీ పోర్టులు, మెడికల్‌ కాలేజీలు, రవాణా శాఖలో ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్ల అందజేత వంటి వాటిని ప్రైవేటు పరం చేసింది. ఇప్పుడు తాజాగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనివల్ల సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయ వద్ద లేఖర్లుగా పనిచేస్తున్న వారు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారనున్నారు.

వివాదాస్పద జీవో

సామాన్యుడి ఆస్తి భద్రతకు గ్యారంటీ అయిన రిజిస్ట్రేషన్‌ వ్యవస్థపై కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పంజా వేయనుంది. ఇందు కోసం రిజిస్ట్రేషన్‌ సేవలను, దస్తావేజుల తయారీ విధానాన్ని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో 396 వివాదాస్పదమవుతోంది. దీనిని దస్తావేజు లేఖర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో సుమారు 600 మంది వరకు లేఖర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, హెల్పర్లు, జిరాక్స్‌, స్టాంప్‌ పేపర్‌ విక్రేతలు నిరుద్యోగులుగా మారనున్నారు.

తొలి దఫా జిల్లా కేంద్రాల్లో..

ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తొలి దశలో 26 జిల్లా కేంద్రాలు, రెండో దశలో 294 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ప్రైవేటీకరించే జాబితా ఖరారైంది. ఈ క్రమంలో తొలి దశలో అమలాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రైవేట్‌ పరం కానుంది. తర్వాత దశల వారీగా రాజోలు, ముమ్మిడివరం, మలికిపురం, మామిడికుదురు, కాట్రేనికోన, రావులపాలెం, ఆలమూరు, పి.గన్నవరం, ఐ.పోలవరం, అత్రేయపురం, కొత్తపేట, రాజనగరం కలిపి మొత్తం 15 సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాలు ఆ జాబితాలో ఉన్నాయి.

ఇప్పటికే ఇబ్బందులు

ఇప్పటికే ఆన్‌లైన్‌, కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని రైతులు, మహిళలు ఆర్‌వో చుట్టూ తిరుగుతున్నారు. ప్రైవేట్‌కి వెళితే వారికి సహాయం చేసే లేఖర్లు ఉండరు. ప్రభుత్వం మాత్రం ఈ విధానం తీసుకురావడం వల్ల అవినీతి తగ్గుతుందని చెబుతోంది. ఇప్పటికే రవాణా శాఖలో ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్లకు పడుతున్న ఇబ్బందులు తెలియనవి కావు. ఇదే పరిస్థితి రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద కూడా వస్తే ఇబ్బంది తప్పదని సామాన్యులంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రియల్‌ ఎస్టేట్‌, భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఈ సమయంలో ఈ విధానం వల్ల ఈ రంగ మరింత దెబ్బతినే అవకాశముందని రియల్టర్ల భయపడుతున్నారు.

దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు సోమవారం నుంచి పెన్‌డౌన్‌ చేపట్టారు. అమలాపురం, రాజోలు, ముమ్మిడివరం, రావులపాలెం సహా అన్ని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల వద్ద నిరసన చేశారు. రిజిస్ట్రేషన్‌ సేవలు, దస్తావేజుల తయారీని ప్రైవేట్‌ సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతాయని నాయకులు చెప్పారు.

రిజిస్ట్రేషన్లు ప్రైవేటుపరం

జీవో విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వం

పెరగనున్న భూ సంబంధిత అక్రమాలు!

ఉపాధి కోల్పోనున్న లేఖర్లు

జిల్లా వ్యాప్తంగా పెన్‌డౌన్‌

సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల వద్ద ధర్నా

సామాన్యులకు ఇబ్బంది

రిజిస్ట్రేషన్‌ అంటే సామాన్యుడికి జీవితంలో ఒకటి రెండుసార్లు వచ్చే ప్రక్రియ. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయంలో ఫీజు కడితే రశీదు బాధ్యత ప్రభుత్వానిది. కానీ ప్రైవేటీకరణ తర్వాత స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు పక్కన పెడితే సర్వీస్‌ ఛార్జి పేరుతో ప్రైవేట్‌ కంపెనీలు అదనపు వసూలుకు పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే మీ –సేవ కేంద్రాల్లో చిన్న సర్టిఫికెట్‌కే రూ.వందలు వసూలు చేస్తున్న అనుభవం ఉంది. అలాగే రైతుల భూముల వివరాలు, పట్టాలు, లింక్‌ డాక్యుమెంట్లు అన్నీ ప్రైవేట్‌ సర్వర్లలోకి వెళతాయి. హ్యాకింగ్‌, డేటా లీక్‌, దొంగ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడు తప్పు జరిగితే సబ్‌ రిజిస్ట్రార్‌ ను ప్రశ్నించవచ్చు. ఆ పరిస్థితి ఇక ముందు ఉండదనే అనుమానాలున్నాయి.

జిల్లాలో రెండే రిజిస్ట్రేషన్లు

జిల్లాలోని 15 సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయాల పరిధి లోని లేఖర్లందరూ ఏకతాటిపై నిలిచి సంఘ నిర్ణయాలకు కట్టుబడి నిరసనను విజయవంతం చేశా రు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రిజిస్ట్రేషన్లు దా దాపు స్తంభించాయి. ఆత్రేయపురం కార్యాలయంలో 2 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగగా, మిగిలిన 14 కార్యాలయాలైన అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, ఆలమూరు, ఐ.పోలవరం, కొత్తపేట, మలికిపురం, మండపేట, మామిడికుదురు, ముమ్మిడివరం, ద్రాక్షారామం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలులో ఒక్కటి జరగలేదు. జిల్లా మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 2గా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement