అమలాపురం రూరల్: జిల్లాలోని ప్రతి పంటకు సకాలంలో సాగునీరు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. జిల్లాలో సాగునీటి పరిస్థితిపై సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఎక్కడా రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా రెండు, మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలని స్పష్టం చేశారు. ప్రధాన పంట కాలువల వెంబడి పూడికతీత పనులను వేగవంతం చేయాలని, బ్రిడ్జిల వద్ద పేరుకుపోయిన బంకమట్టిని తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ అధికారులు ప్రతి రోజూ రెండు మండలాలను సందర్శించి, సాగునీటి పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు. తహసీల్దార్లు, ఇరిగేషన్, వ్యవసాయ శాఖల మండల స్థాయి అధికారులు ప్రతి రోజూ మూడు గ్రామాలను సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంట కాలువల్లో పూడిక, గురప్రుడెక్క, తూము, కలుపు మొక్కలు తదితర అడ్డంకులను వెంటనే తొలగించాలన్నారు.


